Saturday, May 31, 2014

 మూడు తరాల ముచ్చటైన కథ!
30/05/2014 | By MDABDUL
*** మనం (బాగుంది)
తారాగణం:
అక్కినేని నాగేశ్వరరావు
నాగార్జున, నాగ చైతన్య
సమంత, శ్రీయ
లావణ్య, అఖిల్ తదితరులు
మాటలు: హర్షవర్థన్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
నిర్మాణం: అక్కినేని కుటుంబం
కథ, కథనం, దర్శకత్వం:
విక్రమ్ కె.కుమార్
అక్కినేని ఫ్యామిలీ. మూడు తరాల హీరోలు.. అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం...ఏం తీసి ఉంటారు? ఏం చెప్పి ఉంటారు? ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న ఫీలింగ్. పోస్టర్లు ప్రత్యక్షం. తాతగారు చిరునవ్వుతో బాసింపట్లు వేసుకొని.. చేతులు కట్టుకొని.. కింద కూర్చుంటే... రేపటి తరం మనవడు పంచె లాల్చీతో హుందాగా సింహాసనం మీద. ఆ పక్కనే నిన్నటి తరం నవ మన్మథుడు. సూటూ బూటూ కళ్లద్దాల్తో. ఆ పక్కనే కుక్కగారు. ఈ స్టిల్‌తో ఏం చెబుతాడు? తొంగి చూ స్తూ అర చిరునవ్వుతో తాతగారు ఏం చెప్పబోతున్నాడు? ఇదే ఉత్కంఠ. వెంటవెంటనే ట్రైలర్స్... సాంగ్స్ మొదలుకొని విజువల్స్ కూడా.. ఏదో తెలీని భావాలను చెప్పకనే చెబుతున్నాయి. కథేంటో? అన్న ఊహలూ మొదలయ్యాయి. ఏ సినిమాకైనా ఇటువంటి ఆలోచన రావటం.. ఊహల్లో తేలటం ఉండకపోవచ్చు గానీ.. కచ్చితంగా ‘అక్కినేని ఫ్యామిలీ’ ఏ రూపంలో దర్శనమివ్వబోతోందన్న ‘ఆశ’ ప్రేక్షకుల్లో కలిగిందన్నది స్పష్టం. మూడు తరాల హీరోల్ని ‘మనం’ చేసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దీన్ని ఒక సినిమా అనుకోలేదు. ఎక్కడ పొరపాటు చేసినా మొత్తం ‘్ఫ్యమిలీ’ని చుట్టేస్తుంది. కొన్నాళ్లుగా ‘హిట్’లేని నాగార్జునపైనా.. కెరీర్ ఆరంభంలోనే ఉండిపోయిన నాగచైతన్యపై ఆ ప్రభావం తప్పక పడుతుంది. అందుకే! వొళ్లు దగ్గర పెట్టుకొని మరీ.. తన కలానికి మరింత పదును పెట్టి తన సత్తా చాటటంలో సక్సెస్ సాధించాడు విక్రమ్. ఈ ఉపోద్ఘాతం కేవలం అక్షరాలు మాత్రమే. దీన్ని అనుభూతించాలంటే.. మాటలు చాలవు. మనసు తెర తీయా లి. అప్పుడే కథ ‘కన్‌ఫ్యూజన్’ లేకుండా అర్థమవుతుంది. అదీకాక మనసు పెట్టి చూస్తే.. వాస్తవ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో? ఎంత యాంత్రికంగా బతికేస్తున్నామో అర్థమవుతుంది. ఆ సంకెళ్ల నుంచీ ఒక్కసారిగా బయటికి వచ్చినట్టనిపిస్తుంది.
కథ: రాధామోహన్ (నాగచైతన్య) కృష్ణవేణి (సమంత)లకు ‘బిట్టు’ అనే కొడుకు. తరచూ వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు. విభేదాలు. ఇలా జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తూన్న నేపథ్యంలో ఇద్దరూ కారు ప్రమాదంలో మరణిస్తారు. బిట్టు ఒంటరివాడవుతాడు. పెరిగి పెద్దవాడై.. బిజినెస్‌మేన్ నాగేశ్వరరావు (నాగార్జున)గా ఎదుగుతాడు. ఒకరోజు నాగేశ్వరరావు ఫ్లైట్‌లో వెళ్తూండగా పక్క సీట్లోని నాగార్జున (నాగ చైతన్య) తన తండ్రి పోలికలతో ఉన్నాడని అభిమానిస్తాడు. ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూంటాడు. ఈ జన్మలో నాన్న కనిపించాడు. అమ్మ కూడా ఎక్కడో ఉంటుందన్న ఆశ. కొన్నాళ్లకు నాగేశ్వరరావుకి కనిపించిన ప్రియ (సమంత)ను అమ్మలా భావిస్తాడు. అభిమానిస్తాడు. ప్రేమిస్తాడు. ఈ జన్మలోనూ వారిద్దరినీ కలపాలన్న నేపథ్యంలో డాక్టర్ అంజలి (శ్రీయ) ప్రేమలో పడతాడు. వృద్ధుడైన చైతన్య (డా.అక్కినేని)ని రోడ్డు ప్రమాదం నుంచీ రక్షించిన అంజలి కోసం నాగేశ్వరరావును తన ఇంట్లోనే ఉంచుకొనేందుకు నిర్ణయించుకొంటాడు. చైతన్య ఎవరు? నాగేశ్వరరావు, చైతన్యకి గల సంబంధం ఏమిటి? నాగార్జున, ప్రియల గతం ఏమిటి? ఆయా ప్రశ్నలతో క్లైమాక్స్.
ఎవరూ ఊహించని.. ఊహించలేని కథ ఇది. అక్కినేని హీరోలకు ఒకరి పేరు మరొకరికి పెట్టడం అన్నది మరో స్పెషాలిటీ. ఎవరు ఎవరికి తండ్రి? ఎవరు ఎవరికి కొడుకు? ఇలా కొద్దిగా తికమకతో కథ సాగినప్పటికీ.. అదీ కాసేపే. ఆ తర్వాత్తర్వాత ఆప్యాయతలూ.. అనుబంధాలూ... ప్రేమ లాలిత్యం.. మధురానుభూతులు... కుటుంబ పరంగా కోల్పోతున్న మానవీయ సంబంధాలనూ-ఇలా ఒక్కొక్కటీ స్పృశిస్తూ కథని సాఫీగా నడుపుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఒక్కమాటలో చె ప్పాలంటే.. పునర్జన్మ తాలూకు కథ. ఆ కథకి ప్లస్ పాయింట్‌గా మారిన మూడు తరాల హీరోల కానె్సప్ట్. గత జన్మ తల్లిదండ్రుల్ని కలపటం అన్న సబ్జెక్ట్‌ని ఎక్కడా విసుగు అనిపించకుండా నడిపించాడు. ఒక్కసారి 1983 కాలం అంటాడు. మళ్లీ 2014. ఆ తర్వాత మళ్లీ వెనక్కి 1935లోకి వెళ్తుంది కథ.
ఈ సన్నివేశాల పరంగా చూస్తే... నాగార్జున హుందాగా నటించాడు. పి.ఎ. గిరీష్ కర్నాడ్ (బ్రహ్మానందం)కి మొబైల్‌లో ఆర్డర్లు జారీ చేసే సన్నివేశాలైతే కడుపుబ్బ నవ్విస్తాయి. శ్రీయ తో గ్రామీణ వాతావరణంలో నటించిన సన్నివేశాలు.. అక్కినేని చైతన్యల అల్లరి సన్నివేశాలు.. ఇలా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం...దీన్ని ఉదహరించలేదే? అన్నట్టుగా సాగాయి. మనసు ని ఉరకలెత్తించాయి. డా.అక్కినేని గురించి ఏం చెబుతాం? అనే్నళ్ల వయసులోనూ రేపటి తరంతో పోటీ పడి మరీ ‘జీవించాడు’. నాగచైతన్య సినీ కెరీర్‌లో ఒక మైలురాయి ఈ చిత్రం. ఎందుకంటే...తండ్రితో తాతతో కలిసి నటించే అదృష్టాన్నీ అవకాశాన్నీ ఏ మాత్రం వదులుకోకుండా.. తన సత్తా చాటాడు. అతడి నటనలో పరిణతి కనిపించింది. రామలక్ష్మిగా శ్రీయకి చాన్నాళ్ల తర్వాత సరైన రోల్ దొరికింది. ప్రియగానూ.. కృష్ణవేణిగానూ కనిపించిన సమంత - కృష్ణవేణిగా అందంగా కనిపించింది. ఎమ్మెస్, అలీ, కృష్ణుడు, శరణ్య... ఇలా పాత్రలన్నీ వచ్చి వెళ్లేవే. ఇకపోతే... పైన చెప్పినట్టుగా.. కనిపించని మలుపులే కాదు.. ఊహించని ట్విస్ట్‌లూ ఉన్నారుూ చిత్రంలో. మొదటి భాగంలో అమితాబ్, అమల.. సడెన్‌గా వచ్చి వెళ్లటం.. ఆఖరున అఖిల్ రావటం... మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించింది. సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది వనమాలి, చంద్రబోస్ పాటలు. ఆ పాటలకి తగ్గట్టు అనూప్ రూబెన్స్ సంగీతపు సరిగమలు. అన్నీ మాంటేజ్ సాంగ్స్‌తో కావటంవల్ల కనుల తెరపై అందంగా కదలాడి.. మనసులో చెరగని ముద్ర వేశా యి.
1935 నేపథ్యాన్ని అందంగా తీర్చిదిద్దటంలో భాగంగా - గోల్డ్‌స్పాట్ డ్రింక్, మెటాడోర్, అంబాసిడర్ కార్లు.. ఇలా నిన్నటి ప్రపంచాన్ని ఆవిష్కరించటంలోనూ.. ప్రతీ ఫ్రేమ్‌లో ‘రిచ్‌నెస్’ చూపటంలోనూ వినోద్ ఫొటోగ్రఫీ దర్శకుడికి తోడయింది.
మళ్లీ మొదటికి వస్తే... అసలీ కథని అనుకోవటం వెనుక నాగార్జున రియల్ లైఫ్ నేపథ్యం ఉందా? అన్న అనుమానం కూడా రావొచ్చు. తెలిసిన వాళ్లు ‘మనం’ చూసి ఇది నాగార్జున కథే అంటారు. ఇక్కడ ఆ విషయం ప్రస్తావించనప్పటికీ.. ఒక్కసారి ‘రీళ్ల’ని రివైండ్ చేస్తే ‘నాగ్’ నేపథ్యం అర్థమవుతుంది. ఈ సినిమాలోని కేరెక్టర్లన్నీ అవేనంటారు అభిమానులు. ‘ప్రేమ’ అన్న భావగర్భితమైన మాటని ఇంత అందంగా స్క్రీన్‌పై పెట్టొచ్చునన్న ఆలోచనకి నూటికి నూరుపాళ్లు న్యాయం జరిగింది. కథ కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా లేదూ అంటారా? ఒక్కసారి కాదు.. రెండు మూడుసార్లు సినిమా చూడండి. ఏ గందరగోళం ఉండదు. అంతా క్లియర్ కట్. కథకి తగ్గట్టుగానే - ఒక్కో సన్నివేశంలో ఒక్కో నేపథ్యాన్ని చక్కగా ప్రయోగించాడు. ఫిబ్రవరి 14- గంటల స్తంభం.. చేప పిల్లలు చనిపోవటం - కుక్క అదే పనిగా అరవటం - ఇలా ఎనె్నన్నో.
ఎవరూ తక్కువ చేయలేదు. అలాగని ‘అతి’ చేయలేదు. పాత్ర పరిధి మేరకు ‘మూడు తరాల హీరోలు’ తామే సినిమా భారాన్ని తేలిగ్గా మోస్తూ.. అనుభూతుల తీరానికి చేర్చారు. ఆ ఎంగ్జైటీని ‘అఖిల్’ తెరంగేట్రంలోనూ చూపించారు. ఇంటర్వ్యూలో అడిగితే - ‘మనం’లో అఖిల్ లేడు. తాతగారిని మళ్లీ షూటింగ్ టైంలో చూడగలడో లేదోనని అతణ్ణి పిలిచాను అన్నాడు నాగార్జున. వీరంతా కలిసి గ్రూప్ ఫొటో దిగటం.. అమల, అమితాబ్ ఉన్నట్టుండి ప్రత్యక్షం కావటం.. లావణ్య త్రిపాఠి, నీతూ చంద్ర కనిపించటం.. ఇలాంటివెన్నో షాక్‌ల మీద షాక్‌లు.
నాగార్జున, శ్రీయ, సమంత.. రెండు పాత్రల్లో కనిపిస్తూ.. ఏ పాత్రకి ఆ పాత్ర అన్నట్టు నటించారు. బిజినెస్‌మేన్ పాత్రలో చిన్నపిల్లవాడి మనస్తత్వం.. పల్లెటూరి యువకుడి పాత్రలోనూ నాగార్జున పెర్‌ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేనిది. అభిమానులకు అదో కన్నుల పంట. అతడికి ఉండే డ్రెస్ సెన్స్‌ని ఈ చిత్రంలోనూ మెచ్చుకొని తీరాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తూంటే - పేజీలకు పేజీలు. ఇంతటి ముగింపు. సినిమా చూస్తే రాయని ఎన్నో అనుభూతులు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి.


akkin

Tuesday, May 27, 2014