Friday, July 29, 2011

అజయ్‌కి ఛాలెంజ్!

బాలీవుడ్‌లో ఇప్పుడు అబ్బాయిలే వున్నారనీ, మగాళ్లు లేరనీ యాక్షన్ హీరో అజయ్‌దేవగన్ చేసిన కామెంట్‌ని మన యువ హీరో తనీష్ ఛాలెంజి చేస్తున్నాడా? అజయ్ దేవగన్ చెప్పిన మగాడుగా తనొకడు టాలీవుడ్‌లో ఉన్నట్టు తన బాడీని పెంచి పోషిస్తున్నాడా? ‘కోడిపుంజు’లో అమాంతం తెగ లావెక్కిపోయిన తనీష్‌ని చూస్తే ఇది నిజమేనన్పిస్తుంది. బాలీవుడ్‌లో అబ్బాయిల సినిమాలు కేవలం మల్టీప్లెక్స్‌ల్లోనే ఆడతాయని, అలా కాక తనలాంటి, సల్మాన్ ఖాన్‌లాంటి సీనియర్ల సినిమాలు అన్ని సెంటర్లలో ఆడతాయనీ సెలవిచ్చాడు అజయ్‌దేవగన్. ఒక కమర్షియల్ ఎస్సై పాత్రనో, మాఫియా పాత్రనో పోషించాలంటే కనీసం ఇరవై ఏళ్ల సీనియారిటీ ఉండాలని, అబ్బాయిలు ఇక్కడే ఫెయిలవుతారనీ అజయ్ ఎనాలసిస్. నిన్న మొన్నటివరకు టీనేజ్ శరీరంతో ప్రేమ సినిమాలు చేసుకుంటున్న తనీష్‌కి ఒక్కసారిగా మగాడుగా ఎదిగిపోయి మాస్ సినిమాలు చేయాలని బుద్ధిపుట్టిన మాట అతనే ఒప్పుకున్నాడు. దీని రిజల్టు-టీనేజీ ఫేసుతో వస్తాదుబాడీ! ‘కోడిపుంజు’లో ఒంటి చేత్తో రౌడీల బాడీలు హూనం! స్థూలకాయంతో పడలేక జూనియర్ ఎన్టీఆర్, విష్ణు లాంటి యంగ్‌స్టార్సే సన్నబడుతుంటే, తనీష్ లాంటి లేత కుర్రాడు ఇలా పూరీలా విపరీతంగా ఉబ్బిపోవడం బాగా ఎబ్బెట్టుగానే ఉంది సినిమాలో!

రెండో ఆటకి రెడీ!
టాలీవుడ్‌లో కొత్త సీజన్ వచ్చి చేరింది. ఆనవాయితీగా ఉండే సంక్రాంతి, సమ్మర్ సెలవుల సీజన్‌లతోపాటు, గత సంవత్సరంనుంచీ దసరా సీజన్ కూడా ప్రారంభించారు. దసరాకి ‘ఖలేజా’తో మహేష్‌బాబు, ‘పులి’తో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ‘బృందావనం’ విడుదల చేసి బాక్సాఫీస్‌ని టెస్ట్ చేశారు. మొదటిరెండూ టెస్టులో వూస్టయిపోగా, చివరిది ఓ మాదిరిగా తేలి బ్యాడ్ టేస్టుని మిగిల్చాయి. అయినా మళ్లీ దసరాకి రెండో ఆటకి రెడీ అవుతున్నారు. మహేష్‌బాబు ‘దూకుడు’, పవన్ కల్యాణ్ ‘కాళి’, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి‘ మాత్రమే కాక, కాస్త డెలివరీ పెంచుదామని బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’, నాగార్జున ‘రాజన్న’, వెంకటేష్ ‘బాడీగార్డ్’లని కూడా బరిలోకి దింపుతున్నారు. బరిలో రంగహరీ... అంటూ దసరా సంబరాలకి వచ్చేస్తున్న ఈ ఆరు సినిమాల పెట్టుబడిని (దాదాపు 200 కోట్లు) మేమెక్కడనుంచి తెచ్చి సర్దాలని అప్పుడే ప్రేక్షకులు బెంబేలెత్తిపోవచ్చు. మా డబ్బుతో మమ్మల్ని పండగ కూడా చేసుకోనివ్వరా అని శోకాలు పెట్టవచ్చు. అదేం కుదర్దు. టాలీవుడ్ ప్రేక్షకులేం కోరుకుంటున్నారో అదివ్వదు. అదేం ఇవ్వాలనుకుంటోందో అదే ఇస్తుంది. దసరాకి ఆరు సినిమాల్ని హిట్ చేయకపోతే మళ్లీ దసరాకి 12 సినిమాలతో అంతు చూస్తుంది జాగ్రత్త!

అప్పుల్లో ఫ్లాపులు!
ఒక విషయంలో పూరీ జగన్నాధ్‌ని ఒప్పుకోవాలి. తను అప్పుల పాలు కావడంవల్లే హిట్లు ఇవ్వలేకపోయానని ఆయన నిజాయితీగా ప్రకటించాడు. పూరీ కంటే ముందు అప్పులపాలైన తేజ ఇలా ఒప్పుకోలేదు. పైగా ‘నిజం’ దగ్గర్నుంచీ ‘కేక’ వరకు చతికిలబడి, తిరిగి కొత్త సినిమాతో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఆర్థిక బాధలు తీరాయో లేదో గానీ, తిరిగి మొదటికొచ్చి కొత్తవారితో యూత్ సినిమాకి తన క్రియేటివ్ పవర్స్‌ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. మరోవైపు ‘దేశముదురు’ అనే హిట్ తర్వాత నిన్నటి ‘నేనూ నా రాక్షసి’ వరకు ఆరేడు సినిమాలు రాక్షసంగా ఫ్లాపయ్యాక, ‘బుడ్డా హోగా తేరే బాప్’ తో ముఖంలో ఆనందరేఖలు విలసిల్లి ఇప్పుడు ఆర్థిక బాధలు లేవుకాబట్టి ‘బిజినెస్ మాన్’ని బిగ్ హిట్ చేస్తానంటున్నాడు పూరీ. దర్శకులు సినిమా బిజినెస్ కూడా చేస్తే ఏమవుతుందో వీళ్లద్దరే ఉదాహరణ. క్రియేటివ్ పవర్స్ అన్నీ అవకతవక బిజినెస్ కష్టాల్లోంచి బయటపడేందుకే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. జేబు ఖాళీ అయిందని బుర్ర ఇలా ఖాళీ చేసుకుంటే దర్శకత్వానికేం మిగులుతుంది? అంత దూరం వెళ్లనవసరం లేదు. సకాలంలో స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకోలేక, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకుని బుర్రంతా వాటిమీదపెట్టుకునే దర్శకుల పనీ ఇంతే అవుతోంది. ఇది చూస్తూ నిర్మాతలు నట్టేట మునిగి ‘బచావ్ బచావ్’ అని కేకలేస్తున్నారు!

పందెం నెగ్గని పుంజు!

md abdul

* కోడిపుంజు (బాగోలేదు)
తారాగణం:
తనీష్, శోభన
రోజా, శివకృష్ణ
శ్రీధర్, ఎమ్మెస్ నారాయణ
రాజ్యలక్ష్మి, సత్యప్రకాష్
రాళ్లపల్లి తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: శివకుమార్
నిర్మాణం:
శ్రీ శైలేంద్ర సినిమాస్
నిర్మాత: ఎస్.ఎస్.బుజ్జిబాబు
దర్శకత్వం: బి.వి.వి.చౌదరి

ఓ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించే తీరిక నేటి తరానికి లేదు. నచ్చింది చేసేస్తారు. కొన్ని సార్లు పంతాలకు పోయి ఇబ్బందుల్లో పడతారు. కానీ అన్నిసార్లు చేతులు కట్టుకుని కూర్చోవడం కుదరదు. ఆవేశంతో అడుగేస్తేనే లక్ష్యాలు నెరవేరతాయి. అనుకున్న లక్ష్యం కోసం పందెం ‘కోడిపుంజు’లా తెగువ చూపిన కుర్రాడి కథే ఈ చిత్రం. తెలుగు సినిమాని గత ఏడాది కాలంగా పరిశీలిస్తే విడుదలవుతున్న సినిమాలు ఏ మేరకు సొమ్ములు తీసుకొస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎక్కువ శాతం పరాజయానే్న చవిచూస్తున్నాయి. లాజిక్కులేని కథలు, మూస ధోరణిలో సన్నివేశాలు, నవ్వించని కామెడీ ట్రాకులు, కొత్తదనం పేరుతో విపరీత ధోరణులు...ఇవి ప్రేక్షకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నది చిత్రసీమ మీద ఒట్టేసి చెప్పే నిజం. తెలుగు సినిమాలో కథ అనేది బ్రహ్మపదార్థం. అది వుంటే వుంది అనుకోవాలి. లేదు అంటే లేదు అనుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది ఈ ‘కోడిపుంజు’ విషయంలో.
కథలోకి వెళితే...తండ్రికి తగ్గ తనయుడు అనే మాట విన్నాం. కానీ తల్లికి తగ్గ తనయుడనేది మనం చాలా తక్కువ విన్నాం. ఈ కోవకి చెందిన యువకుడే అభిమన్యు (తనీష్). తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా)గారి అబ్బాయి అంటే చాలు. తల్లి చూసి రమ్మంటే పీకి వచ్చే రకం. తల్లి నుంచి వారసత్వంగా ఆస్తితో పాటు కావలసినంత పొగరు వచ్చింది. కొడుకుతో తొడగొట్టించి మరీ కయ్యానికి పంపే ఘటికురాలు సీతారత్నం. పెద్ద కత్తి సంచిలో పెట్టుకుని మోపెడ్ మీద తిరుగుతుంటుంది. తేడా వస్తే కత్తితో తిరగబడుతుంది. సీతారత్నం భర్త వ్యవసాయంలో నష్టమొచ్చి ఆత్మహత్య చేసుకుంటే, తనే వ్యవసాయధారిణిగా మారి రెండు ఎకరాలని ఇరవై ఎకరాలు చేసింది. కొడుకుని మంచి చదువులు చదివించి మంచి ప్రయోజకుడిని చేసింది. ఇలా వుంటే తూర్పుగోదావరి జిల్లాలో ‘రామరాజు లంక’ అనే గ్రామం. ఆ గ్రామ ప్రెసిడెంట్ రామచంద్రరావు (శివకృష్ణ) దాన ధర్మాలలో అందె వేసిన చేయి. ఆ విషయంలో ఎంతో పేరు సంపాదిస్తాడు. తన ఐదు వందల ఎకరాలని యాభై ఎకరాలు చేశాడు. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైతే, చిన్న అమ్మాయి నందిని (శోభన) ఇక్కడే చదువుకుంటోంది. అదే గ్రామంలో రామచంద్రరావు కుర్చీ మీద కనే్నసి వున్నాడు అల్లూరి బాపీనీడు (సత్యప్రకాష్). ఇతని తమ్ముడు నాగినీడు రామచంద్రరావు కూతురి మీద కనే్నశాడు. ఒకానొక సమయంలో నందినీని టీజ్ చేసిన నాగినీడుని వీరబాదుడు బాదుతాడు అభిమన్యు. ఆ సమయంలో అతడి కండ బలం చూసిన నందిని అతడి ప్రేమలో పడుతుంది. ఈ విషయంలో నాగినీడుతో చాలా సమస్యలు వస్తాయి. అతను దగ్గరవ్వడం, అతన్ని క్షమించి అభిమన్యు తన గ్రూపులో చేర్చుకోవడం ఆమెకి నచ్చదు. అయితే అభిమన్యు-నందినీల ప్రేమ ఇటు సీతారత్నంకి, అటు నందిని తల్లి (రాజ్యలక్ష్మి)కి తెలిసిపోతుంది. పిల్లల ప్రేమను కాదనలేక ఎంతో సంతోషంతో ఇద్దరూ అంగీకారం తెలుపుతారు. ఓ రోజు శ్రీరామనవమి సందర్భంగా నందినితో అభిమన్యు పందెం కాసి, ఆ దరిమిలా ఆమె తండ్రి కంటపడిపోతాడు. తన కూతురితో అతడి ప్రవర్తనకి మండిపడి అభిమన్యు తల్లి సీతారత్నం క్యారెక్టర్‌పై కూడా నిందారోపణలు చేస్తాడు. ఈ ఆరోపణలకు ఆవేశం ఆపుకోలేని అభిమన్యు ఆత్మాభిమానం దెబ్బతిని ‘మీ కూతుర్ని తన వశం చేసుకుంటా. ఎన్నికలలో నవ్వు పరాజయం పొందేలా చూసి నీ పరువుతీస్తా’ అని సవాల్ విసురుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు సిసలైన ‘కోడిపుంజు’ క్లైమాక్స్.
ఈ సినిమాని పూర్తి మాస్ అనుకుని చూస్తే సగం వరకే అలాంటి అనుభూతి కలుగుతుంది. దర్శకుడు బి.వి.వి చౌదరి ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేకపోగా, చూసే ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. సినిమాల్లో ఓ సూత్రం వుంది. కొత్త కథను అర్థమయ్యేలా చెప్పాలి. పాత కథను కొత్తగా చెప్పాలి. ఇది చాలా వరకు ఫలితాన్నిచ్చే సూత్రమే. ఎందుకంటే మన దర్శకులు చాలా వరకూ పాత కథల్నే వండిస్తూ తాళింపు, మసాలాల్లో చూపే తేడా వల్లే ప్రేక్షకులు కూసింత కొత్త దనాన్ని ఫీలవుతుంటారు. కానీ ఈ ‘కోడిపుంజు’లో ఆ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ‘దమ్మున్నోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన చౌదరి ఈ ‘కోడిపుంజు’ని పందెం నెగ్గేలా తీర్చిదిద్దలేకపోయాడు. రొటీన్ కథనే తీసుకున్నా, అందులో అతడి ప్రతిభని ఏ మాత్రం చూపించలేకపోయాడు. కాలం చెల్లిన కథే అయినా దాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. చిత్ర ప్రథమార్థంలోతెచ్చిన టెంపోని దర్శకుడి ద్వితీయార్థంలో చూపించలేక చతికిల పడ్డాడు. విశ్రాంతిలో హీరో చేసిన ఛాలెంజ్‌లు ద్వితీయార్థంలో పూర్తిగా మరచిపోయారు. దీంతో కథంతా గజిబిజిగా సాగి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది.
ఇక నటీనటుల విషయానికొస్తే...లవర్‌బాయ్ ఇమేజ్‌ను వదిలి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో బాడీని విపరీతంగా పెంచేసుకుని స్థూలకాయుడిలా మారిపోయిన తనీష్ తన పాత్రకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఎమోషనల్‌గా వుంటూనే సీతారత్నంలా రోజా అభినయం మెచ్చుకోతగ్గది. ఇలాంటి పాత్రలు ఆమెకు అతి సులువైనవే. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కొత్తనటి శోభన సోసోగానే చేసింది. ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా బాగా పండించాల్సింది. మిగతా నటీనటుల సంగతి సరేసరి. సంగీతం విషయానికొస్తే అనూప్ రూబెన్స్ బాణీలు అంతగా ఆకట్టుకోలేదు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ‘వాలే వాలే..వయసే వాలే..’ తనీష్, మధుశర్మలపై ఒకే ఒక్క పాట మాస్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు కెమెరా వర్క్‌ని అందించిన బి.శివకుమార్‌ని మెచ్చుకోకుండా వుండలేం. తన వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహించారు. మాటల విషయానికొస్తే...రోజా కొడుకుతో ‘కమ్మెయ్, చంపేయ్, నరికేయ్ అని నిన్ను కోడిపుంజులా పెంచానని చెప్పడం, కోపంగా వున్న ప్రతీసారి హీరో ‘నా పేరు అభిమన్యు..సన్నాఫ్ దగ్గుబాటి సీతారత్నం’ అని చెప్పడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఎడిటింగ్ సోసోనే. మొత్తం మీద ఓ నాసిరకమైన కథను ఎంచుకోవడమేగాక, పసలేని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల మీదికి వదిలిన ఈ ‘కోడిపుంజు’ పందెంలో ఏ మాత్రం నెగ్గలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనీష్ కథల విషయంలో ఇకనైనా జాగ్రత్త వహిస్తే బావుంటుంది.

Friday, July 22, 2011

నటన తార?

తమాషా కార్నర్

సినిమాల్లో నటన విరమించుకుంటున్నానని చెప్పి అద్భుతమైన వీడ్కోలు దృశ్యం సృష్టించి తీరా జీవితంలో నటించడం మొదలుపెడితే ఆ నటీమణికి ‘నటనతార’ బిరుదు ఇవ్వాల్సిందే. మనం చెప్పుకుంటున్నది నయనతార గురించి. ‘శ్రీరామరాజ్యం’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుని, యూనిట్ సభ్యులకి వాచీలు పంచిచ్చి అందరి హృదయాలూ బరువెక్కించి నిష్క్రమించింది. దీనర్ధం ఆమె ప్రభుదేవాని వివాహం చే సుకుని సినిమాలకి స్వస్తి చెబుతున్నట్టు అని సహజంగానే మీడియాలో ప్రచారమైంది. అది వివాహానికి ప్రభుదేవా పెట్టిన షరతు అన్నారు. సన్నివేశం, దానికి తగ్గ వ్యాఖ్యానంగానే ఈ మొత్తం వ్యవహారం కనిపించింది. తీరా ఈ మంగళవారం నయనతార దీన్ని ఖండించింది. తనకి సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనే లేదని, ఈ వార్తలెలా ప్రచారంలోకి వచ్చాయో తెలియడంలేదని వాపోయింది. ఇప్పుడు ఎవరు తెల్లబోవాలి-మీడియానా? అసలు నయనతార సెట్లో అలాంటి టచింగ్ సీన్ ఎందుకు క్రియేట్ చేసింది? ఏ సినిమా ముగింపు సందర్భంగానూ అలాచేయలేదే? ఇంతకీ ఆమె నయనతారా? లేక నటనతారా? అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. కాస్సేపు జుట్టు పీక్కుందాం!

స్టార్లు కావలెను!

చిన్న కథలు రాసుకుని చిన్న నిర్మాతల్ని సంప్రదిస్తున్న దర్శకులకి వింత అనుభవం ఎదురవుతోంది. చిన్న నిర్మాత కూడా పెద్ద స్టార్‌ని అడుగుతున్నాడు. చిన్న హీరోలతో, కొత్తవాళ్లతో తీస్తే 30 శాతం ఓపెనింగ్స్ కూడా రావడంలేదు. తీసి ఏం లాభమని పెదవి (ప్రపోజల్స్) విరుస్తున్నారు. ఛిద్రమైన ప్రపోజల్స్‌తో దర్శకులు తిరిగి వస్తున్నారు. పోనీ పబ్లిసిటీ, పంపిణీ నెట్‌వర్క్స్ బాగా ఉన్న అగ్రనిర్మాతల దగ్గరికి పోదామంటే ఆ చిన్న సినిమాతో వాళ్లకే పేరొస్తుంది తప్ప దర్శకుడికి మళ్లీ సినిమా రాదు. ఇక కొత్తగా వచ్చే నిర్మాతలే బెటర్ అనుకుంటే అలా వస్తున్న వాళ్లు అతి తక్కువమంది, దర్శకులు ఎక్కువమంది. డిమాండ్-సప్లై పరిస్థితి ఈ తీరున ఉంటే ఇంకా ఎటువైపు చూడాలి? ఎంతకాలం ఎదురు చూడాలి? చిన్న నిర్మాతలు కూడా స్టార్స్ కావాలంటుంటే చిన్న చిన్న హీరోలు ఏమైపోవాలి? నాని లాంటి చిన్న హీరోలని కూడా రాజవౌళిలాంటి టాప్ దర్శకులు లాగేస్తుంటే, వాళ్లు అందకుండా అమాంతం స్టార్లు అయిపోతున్నారు. ఇంకేం చెయ్యాలి? ఇంకేం చేయనక్కర్లేదు, చిన్న సినిమాల్ని చిన్న నిర్మాతలే బతకనిచ్చే రోజుల్లేవని, వాళ్లు స్టార్ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయాల్సిందేనని ఓ దర్శకుడి విసురు!

మల్టీషాక్?

సింగిల్‌స్టార్ సినిమాలు సింగిల్‌స్టార్ రివ్యూలకి నోచుకుంటున్న గడ్డు పరిస్థితుల్లో మల్టీ స్టారర్ సినిమాలైనా రావాలని-అలా బాలీవుడ్‌కి దగ్గరగా చేరి జాతి జీవన స్రవంతిలో కలవాలనీ బయ్యర్ల దగ్గరనుంచి ప్రేక్షకుల వరకు ఆశించడంలో తప్పులేదు. అదిగో అందుకే స్టార్ నిర్మాత దిల్‌రాజు అలాంటి మల్టీస్టార్ కల సాకారమయ్యేందుకు విక్టరీ వెంకటేష్‌నీ-పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌నీ ఒక దగ్గర చేర్చి హమ్మయ్య అనుకున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా హమ్మయ్యా అనుకునేంతలో సమ్-అయ్య మిస్సయ్యాడు! ఎవరా అని చూస్తే పవన్‌కల్యాణ్! తను టాటా చెప్పేసి తన పవర్ వేరే సినిమాకి చూపిస్తుంటే షాకైన నిర్మాతకి దర్శకుడికి మళ్లీ మొదటకొచ్చింది. ఈసారి ప్రిన్స్ మహేష్‌బాబుని మిస్సింగ్ ప్లేసులోకి తెచ్చుకున్నారు. ఇది కూడా మిస్సింగ్ కేసు కాకూడదని ప్రార్ధిస్తున్నారు. కానీ ముందుంది ‘దూకుడు’. మహేష్‌బాబు ‘దూకుడు’ విడుదలయ్యాక దాని ఫలితాలెలా ఉంటాయో, బాబు మైండ్ సెట్ ఎలా మారి ఎలా మరో మల్టీషాకు తగులు తుందోనన్న ఆందోళనతో ఫిలింనగర్ పరిసరాల్లో పనీపాటా లేని వర్గాలు తిండి తిప్పలు మానేసి గడుపుతున్నాయి. ఫ్యాన్స్‌కి లేని దురద వీళ్లకెందుకంటారా-కొందరింతే! *

Friday, July 15, 2011

మెగాలీల!

తమాషా కార్నర్

అదృష్టం ఎప్పుడెవరికెలా వరిస్తుందో తెలీదు. సినిమా ఫీల్డులో స్ట్రగుల్ చేస్తున్న సాధారణ జీవులే కాదు, అగ్రస్థానాలకి చేరుకున్న ప్రముఖులూ ఇంకా అదృష్టం కోసం పరితపిస్తూంటారు. అది వరించకపోతే అంతటాప్ పొజిషన్‌లో కూడా విచారపడతారు. మెగాస్టార్ చిరంజీవి పరంగా అదృష్టం కోసం ఎదురుచూస్తున్న టాప్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అసలు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు, అసలుంటుందా లేదా అన్న సస్పెన్సులో కూడా వినాయక్ ఆ అదృష్టం తనకే వరిస్తుందని నమ్మడం, పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్టు సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగిపోయాయ. ఇంతలో ఉరుములేని పిడుగులా వార్త వచ్చి నెత్తిన పడింది. చిరంజీవి 150వ సినిమా పూరీ జగన్నాథ్ ఖాతాలో కెళ్లిపోయింది. అంతేకాదు, 151వ సినిమాకి రామ్‌గోపాల్‌వర్మ అప్పుడే కర్చ్ఫీ వేసేసినట్టుకూడా గుప్పుమంది! మ్యూజికల్ ఛైర్స్ ఆటలో తానొక్కడే వున్నానని నమ్మిన వినాయక్ చూస్తుండగానే, పూరీ దర్జాగా వచ్చి తిష్టవేయడం కంగు తినిపించింది. ఇదంతా మెగాలీల! తలవంచక తప్పదు మరి!!

అడ్వాన్స్ లుక్!
అసలే పైరసీతో సినిమాలు గజగజ వణికిపోతున్నాయి. దీనికి నకిలీ స్టిల్స్ కూడా తోడుగా తయారవుతున్నాయి. నిర్మాతలు సినిమా పూర్తయ్యాక విడుదల చేసే ఫస్ట్‌లుక్ ఫోటోల వరకూ ఇక ఆగనవసరంలేదనీ, సినిమా ప్రారంభించడానికి ముందే అడ్వాన్స్ లుక్ చూపించేస్తామనీ కొందరు ఔత్సాహికులు ఇంటర్నెట్‌లో హడావిడి చేస్తున్నారు. ఫోటోషాప్‌తో షాపింగ్ చూపించేస్తున్నారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇంకా నటించనున్న ‘గబ్బర్‌సింగ్’ స్టిల్స్ సృష్టించి అభిమానులకి అమితానందం కలిగిస్తున్నారు. దీనిపై నిర్మాత గణేష్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇకనైనా అడ్వాన్స్ లుక్ ఔత్సాహికులు తమ ప్రయత్నాలు మానుకుంటారో లేదో తెలీదుగానీ, వాళ్లని అదుపులో పెట్టడానికి పవన్‌కళ్యాణ్ కూడా సరిపోడనిపిస్తోంది. రియల్ గబ్బర్‌సింగ్ గగనతలం నుంచి పాన్ మసాలా తిని వూసి ‘కిత్నే ఆద్మీ థే రేవో?’అని గర్జిస్తే తప్ప, నెట్‌మాటున వెటకారాలు చేస్తున్న ఆద్మీలు పుంజాలు తెంపుకుని పారిపోయేలా లేరు. అప్పుడు వాళ్లకి ఆద్మీలుక్స్ కూడా వుండకపోవచ్చు!

ఫ్రెష్ టైటిల్స్!
ఇక తెలుగు సినిమాల్ని క్రిమికీటకాలు ఏలుకుంటాయ! రకరకాల సింహాలుగా, పులులుగా, నాగులుగా జంతు జలాన్ని కవర్ చేసిన మన స్టార్లు ఈ చరాచర సృష్టిలో క్రిమికీటకాదులపై ఇంట్రస్టు చూపుతున్నారు. దీంతో వారికి ఊసరవెల్లి, ఈగ, కందిరీగ లాంటి జీవులు ప్రాణ ప్రదమవుతున్నాయి. ఇవి గనుక ఫర్వాలేదన్పించే తీరులో పరువు నిలబెడితే మిడుత, జోరీగ, మిణుగురు పురుగు, దోమ, గండుచీమలాంటి టైటిల్స్‌తో ఫారాలు పట్టుకుని పోటాపోటీగా రిజిస్ట్రేషన్లకి పరుగులు తీయవచ్చు. ఇవి కూడా ఐపోతే ఎలా అన్న చింత అక్కర్లేదు. సూక్ష్మజీవులున్నాయి. వైరస్, బాక్టీరియా, అమిబా, హైడ్రా, ఈ-కోలీ లాంటివి మరింత క్రేజ్ సృష్టిస్తాయి. మోడరన్‌గా కూడా వుంటాయి. ఇంకా నేచర్‌ని కొల్లగొట్టడానికి సముద్ర సంపద కూడా వుంది. ఎలాగూ అనె్నం పునె్నం తెలీని చేపలకి, తిమింగలాలకి అవినీతి చేప, అవినీతి తిమింగలం అంటూ పత్రికల్లో రాసేస్తున్నారు కాబట్టి, కేడీ చేప, రౌడీ తిమింగలం, కంత్రీ రొయ్య అనే టైటిల్స్‌ని విప్లవాత్మకంగా సృష్టించుకుని పెట్టుకోవచ్చు. ఇది ఏ జీవహింస చట్టాల కిందికీ రాదు గాక రాదు! *

పెళ్లికి రెడీ..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు ప్రభుదేవా, నయనతారల పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తోంది. వాళ్లిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో వున్నట్లు కోలీవుడ్ సమాచారం. ప్రభుదేవా తమతో వుండేలా చూడాలంటూ భార్య రమలత కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేసింది. అందుకు ఇరు కుటుంబాల నుండి స్పందన లేకపోవడంతో ఇద్దరు ఇష్టపూర్వకంగా విడాకులను పొందేందుకు కోర్టుకు విన్నవించారు. ప్రభుదేవా, రమలత విడాకుల కేసు విచారణకు ఇరువురూ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలరీత్యా హాజరుకాలేమని వారు తమ న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ కేసు వాయిదాపడింది. తన మొదటి భార్య రమలతకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.5 లక్షల రూపాయలను ఇటీవల ప్రభుదేవా చెల్లించారు. అలాగే చెన్నరు అన్నా నగరంలోని ప్లాట్, ఫామ్‌హౌస్, మరో మూడు ప్లాట్‌లను, చెన్నరు ఈసిఆర్ రోడ్డులోని 22 సెంట్ల ప్లాటును హైదరాబాద్‌లోని స్థలంతోపాటు రెండు కార్లను కూడా రమలత తన ఇద్దరు కుమారులు రిషి, ఆదిత్య పేర్లమీద రిజిస్టర్ చేయించారు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చునంతా ఆయనే భరించనున్నారు. మొత్తానికి ప్రభుదేవా నయనతార కోసం ఇవన్నీ వదులుకోవలసి వచ్చింది. ఇది ఇలా వుండగా సినీ నేస్తాలు ఇక సెలవు అంటూ నయనతార గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టింది. ప్రభుదేవా, నయనతార త్వరలో పెళ్లికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో నయనతార నటనకు స్వస్తి పలకనున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రభుదేవాకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుదేవా, నయనతార చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఆయన భార్య రమాలత తీవ్రంగా ఖండించారు. తరువాత ఒక ఒప్పందంతో వివాహ రద్దుకు సమ్మతించారు. కోర్టు త్వరలో వీరి వివాహ రద్దును ప్రకటించనుంది. దీంతో ప్రభుదేవా, నయనతారల పెళ్లికి లైన్ క్లియర్ కానుంది. కాగా వివాహనంతరం సినిమాల్లో నటించకూడదని నయనతారకు ప్రభుదేవా కండిషన్ పెట్టారట. అందుకు ఆమె కూడా సమ్మతించారట. ప్రస్తుతం నయనతార ‘శ్రీరామరాజ్యం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సమయంలోనే నయన కంటతడి పెట్టింది. ఇదే నయన చివరి చిత్రం. బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా ఇందులో నటించారు. ప్రస్తుతం ప్రభుదేవా, నయనతార ముంబయిలో ఉంటున్నారు. వీరి వివాహం కూడా ముంబయిలోనే జరిగే అవకాశం ఉంది. కాగా శ్రీరామరాజ్యం షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన నయనతార ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన అనంతరం యూనిట్ సభ్యులందరినీ కలుసుకుని నమస్కరిస్తూ బాధగా సెలవు తీసుకుంది. *

Monday, July 11, 2011

గాడితప్పిన కథ

-ఎం

* బ్రమ్మిగాడి కథ
తారాగణం:
వరుణ్‌సందేశ్, అస్మితాసూద్
కృష్ణుడు, పూనమ్‌కౌర్
బ్రహ్మానందం, అలీ
నాగినీడు, జయప్రకాష్‌రెడ్డి
శివప్రసాద్ తదితరులు
సంగీతం: కోటి
ఫొటోగ్రఫీ: జవహర్‌రెడ్డి
నిర్మాణం: మల్టీడైమన్షన్స్
ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
నిర్మాత: రజత్ పార్థసారధి
దర్శకత్వం: వి.ఈశ్వర్‌రెడ్డి

కథలో సరైన ట్విస్ట్ లేనప్పుడు దానికి కొన్ని మసాలాలు వేసి పోపుపెట్టడం అవసరమే! అయితే కొన్ని విచిత్రమైన మలుపులున్నప్పుడు స్క్రిప్ట్ పకడ్బందీగా వుండాలి కదా? ఒక పాత్రద్వారా జరగబోయేది కొంచెం సస్పెన్స్‌గా చెప్పుకుంటూ వెళ్లాలి. అయితే సస్పెన్స్ క్రియేటర్ హాస్యగాడైతే...సదరు హాస్యం వర్కవుట్ అవుతుందా, లేక సస్పెన్స్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తారా? అని చూసుకుంటే ఈ చిత్రం పేరు మరోలా ఉండేది. కథలు చెబుతుంటే వినడానికి బానే ఉంటాయి. అయితే కథలో చెబుతున్నట్టుగా మన జీవితాల్లో జరుగుతుంటే ఆసక్తిగానే ఉంటుంది. అటువంటి ఆసక్తిని పెంచడానికి చేసిన ప్రయత్నమే ఈకథ.
శివ (వరుణ్ సందేశ్) గుల్బర్గాలో చదువుకోసం బయలుదేరుతాడు. మధ్యలో తన కోసం ఎదురు చూస్తున్న మామ (జయప్రకాశ్‌రెడ్డి) ఇంటికి వెళ్లవలసి వస్తుంది. అతని ప్రయాణంలో ఆపదలో ఉన్న మాయ (అస్మితాసూద్) తారసపడుతుంది. కొందరు రౌడీలు ఆమెను అంతం చేసే ప్రయత్నంలో ఉంటారు. వారినుండి శివ సాయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మాయ. ఒకవైపు హంతకులు ఈ జంటను వెంబడిస్తుంటే, శివ మామ తరఫు మనుషులు కూడా ఈ జంటను పట్టుకునేందుకు తరుముతుంటారు. ఈ రెండు గ్రూపులకు చిక్కకుండా వారెలా తప్పించుకున్నారు అనేది, అసలు మాయ ఎవరు? ఆమె వెనుక కథేంటి అనేది ఒక ట్రాక్. అయితే ఈ కథంతా సినిమా తీయబోతున్న జయప్రకాశ్‌రెడ్డికి సినీ డైరక్టర్ బ్రహ్మం (బ్రహ్మానందం) తన కథగా చెబుతుంటాడు. ఒక ఫ్రేమ్‌లో బ్రహ్మం కథ చెబితే మరో ఫ్రేమ్‌లో కథలో ఉన్నట్టుగానే శివ ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయాన్ని గుర్తించిన జయప్రకాశ్‌రెడ్డి తన అల్లుడు ఎక్కడికి వెళ్లాడో బ్రహ్మం ద్వారా కనుక్కుంటూ అక్కడికి రౌడీలని పంపించడం తద్వారా మరికొంత హాస్యాన్ని అందించడం మరో ట్రాక్. చివరికి రెండు గ్రూపుల్లో ఏ గ్రూప్‌కి ఈ జంట చిక్కింది అన్నది మిగతా కథ.
గతంలో వచ్చిన ‘ఎ ఫిలిం బై అరవింద్ థ్రిల్లర్‌గా వస్తే, దానికిది కామెడీ వెర్షన్ అనుకోవచ్చు. ఒక్కడు, వసంత కోకిల లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. జరగబోయే సంఘటనలను రచయిత చెప్పడం, అవే సంఘటనలు ఖచ్చితంగా జరగడం, చివరికి హీరో చనిపోతాడని కధలో ఉండడం, తద్వారా సస్పెన్స్‌ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. అలాగే హీరోయిన్ ఆపదలో ఉంటే హీరో రక్షించుకుంటూ వెళ్లడం ‘ఒక్కడు’ చిత్రంలో మనం చూశాం. ఈ ట్రాక్‌ను కూడా హాస్యంగా రూపొందించే ప్రయత్నం చేశారు. వసంత కోకిలలో శ్రీదేవి తన జ్ఞాపకాలను మర్చిపోవడం అనేది మనకు తెలుసు. అయితే చిత్రం క్లైమాక్స్‌లో సదరు జ్ఞాపకాల విషయాన్ని వదిలేసినట్టయింది. కథాపరంగా సస్పెన్స్, హాస్యం, రెండు ట్రాక్‌లు నడిపించే ప్రయత్నం కొంత సఫలమైనట్లే. అయితే కమెడియన్ బ్రహ్మానందం సస్పెన్స్‌తో కథ చెప్పడం తేలిపోయింది. లవ్‌స్టోరీ కాకపోయినా అందులో ఏదో ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కామెడీకి పెద్ద పీట వేసినా, కృష్ణుడు పాత్ర ప్రాధాన్యత లేక వెలవెలపోయింది. హీరో హీరోయిన్‌పై జాలితో ప్రేమించాడా? అసలు హీరోయిన్ తను పూర్తి ఇష్టంతోనే హీరోతో ప్రేమలో పడిందా? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రతి పాత్ర కూడా దానికి తగ్గట్టు ప్రవర్తించక విపరీత ధోరణిలో నటిస్తాయి. హీరో హీరోయిన్లు ఇద్దరూ చిత్రంలో ఎక్కువ భాగం పరిగెత్తుతూనే గడిపారు. ఈ ప్రయాణంలో అనేక పాత్రలు ఎదురవుతాయి. ఆ పాత్రల ద్వారా హాస్యాన్ని పిండే ప్రయత్నం చేసినా అది వృథా అయింది. క్రీడారంగంలో జరిగే మోసాలు, దారుణాలు కొంత చూపించే ప్రయత్నం బాగుంది. అదే రూట్లో మరికొంత కథను చేర్చుకుంటే చిత్రానికి నిండుదనం వచ్చేదేమో!
నటుల్లో వరుణ్‌సందేశ్, అస్మితాసూద్ సరైన నటన కనబరచలేకపోయారు. కొంతలో కొంత బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి కాంబినేషన్ హాస్యాన్ని పండించింది. కృష్ణుడి పాత్ర రొటీన్‌గామారింది. కెమెరా పనితనం డల్‌గా కనిపించింది. హైదరాబాద్‌లో వున్న లొకేషన్లన్నీ చిత్రంలో ఉపయోగించుకున్నారు కానీ కెమెరా క్లారిటీ మిస్ అవడంతో అవన్నీ బాగా కనిపించలేదు. కోటి సంగీతంలో ‘చెప్పలేనిమాట చెప్పుకుంటే’ పాట బాగుంది. ఎడిటింగ్, మాటలు ఫర్వాలేదు. దర్శకత్వపరంగా స్క్రిప్టులో మరికొంత బాగా చేసుకుంటే చిత్రం తీరు మరోలా ఉండేది. మొత్తానికి సాదాసీదా చిత్రంగా ‘బ్రమ్మిగాడి కథ’ మిగిలిపోయింది.

తమాషా కార్నర్

బుక్కయిపోయాను మొర్రో!

టైమ్‌బాగా లేనప్పుడు తగ్గి ఉండాలంటారు. చేతులారా కష్టాలు తెచ్చుకున్నప్పుడు ఇంకా తలొగ్గి ఉండాలంటారు. కానీ మన తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న తమిళ యంగ్ హీరో సిద్ధార్ధ్‌కి ఈ ప్రాప్తకాలజ్ఞత లోపించినట్లుంది. అబ్బాయిగారు అడ్డంగా మాట్లాడేసి కొత్త కష్టాలు తెచ్చుకున్నాడు. ఎంతో అట్టహాసంగా విడుదలైన తన కొత్త సినిమా ‘180’ గురించి ఏదో ఛానెల్ ఏదో వ్యాఖ్యానించిందని ట్విట్టర్‌లో తన మార్కు స్పందనతో తిప్పికొట్టాడు. కొన్ని థర్డ్ గ్రేడ్ ఛానళ్లు గంట కవరేజి కోసం తమ కుటుంబాల్నే అమ్ముకుంటున్నాయనీ, వాళ్ల గాసిప్స్‌కి జవాబివ్వడం టైం వేస్టు అని టైపుకొట్టాడు. ఆ తెల్లారే మీడియా సమావేశం పెట్టాడు. ఆ సమావేశంలో తాను మాట్లాడబోతుండగానే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ లేచి వాకౌట్ చేశారు. దాంతో అవాక్కయిన సిద్ధార్ధుడు చేసేది లేక తను కూడా వెళ్లిపోయాడు. అసలే సినిమా ఫ్లాపయి బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడింది. సినిమాను నమ్ముకున్న వాళ్లందరినీ నట్టేట ముంచింది. ఈ క్లిష్ట పరిస్థితిలో మీడియా సహకారం చాలా అవసరమనుకుంటే తనని అనాధని చేసి వెళ్లిపోయారేమిటి అని జుట్టుపీక్కున్నాడు. ట్విట్టర్‌లో తన టైపింగ్ సరదా ఇంతపని చేస్తుందనుకోలేదు. తమిళనాట తనకి ఆదరణలేక ‘బొమ్మరిల్లు’తో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని సెటిలైన తను, ఈ మధ్య వరసగా ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు సూపర్ ఫ్లాప్స్‌తో దెబ్బతినిపోయి ‘180’మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఈ సినిమా ముసలిదైపోయిన కేన్సర్ కథ! తను కుర్రాడై తనని విపరీతంగా అభిమానించే కుర్రకారుకోసం కాలం చెల్లిన సినిమా తీస్తాడట! హవ్వ! హవ్వ!!

చరిత్ర తెలుసుకోకు,
చెప్పేది చెప్పేయ్!
నిత్యామీనన్ ఇటీవల పలికిన ‘ప్రభాస్ ఎవరు?’ పలుకులు ‘యూ టూ బ్రూటస్?’ అంత పాపులరయ్యాయి కదా, ఇది తను నటించిన ‘180’కి బూస్టప్ ఇవ్వాల్సింది. ఈ సినిమాలో ప్రేక్షకులు తనని విరగబడి చూసేందుకుదోహదం చేసి ఉండాల్సింది. అలా జరగలేదు. ఆమె అన్న మాటల మీద దుమారం రేపి ఆమె పాపులారిటీనిపెంచే మహత్కార్యం చేయలేదు పరిశ్రమ. కానీ పరిశ్రమ ఈమెని గమనిస్తోంది. ఒక సీనియర్ హీరోతో నటించేందుకు నిరాకరించింది. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనేసింది. ఆ సీనియర్ హీరోకి రుచించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభాసెవరో తనకు తెలియదని నోరుజారిందో, అప్పడిక దీన్ని అవకాశంగా తీసుకుని ఆమెని అణచివేసేందుకు సీనియర్ హీరోలు రెడీ అయ్యారని ఫిలింనగర్‌లో గంట మోగింది. ఇదెంత వరకు నిజమో తెలీదుగానీ అసలు నిత్యామీనన్ ఇలా తయారయ్యేందుకు దర్శకుడు జయేంద్రే కారకుడని తేల్చాలి. ఎందుకంటే ‘180’లో నిత్యామీనన్ సిద్ధార్థ్ ఎవరో ఏమిటో ఎక్కడ్నించి వచ్చాడో తెలుసుకోకుండానే ప్రేమించేస్తుంటుంది చివరి వరకూ. కాబట్టి ‘చరిత్ర తెలుసుకోకు చెప్పేది చెప్పేయ్’ అన్న మెంటల్ కండిషన్ జయేంద్రనుంచే సంప్రాప్తించినట్లు భావించాల్సి వస్తోంది!

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేనట్టే!

-ఎం

ఈ మధ్య అందాలతార త్రిష పెళ్లి గురించిన వార్తలు దక్షిణాదిన షికార్లు చేశాయి. ఆమె ఆ వార్తలను చిరునవ్వుతో తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై త్రిష పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ-‘ఈ వార్తలు విని నేనూ ఆశ్చర్యపోయాను. ఎవరు ఇలాంటివి సృష్టిస్తారో నాకు అస్సలు అర్థం కాదు. అయినా తారలపై వచ్చే ఇలాంటి పుకార్లు ఎవరూ పట్టించుకోరు. నా పెళ్లికి అప్పుడే తొందరేం లేదు. తమిళంలో అజిత్‌తో చేస్తున్న ‘మంకత’ నా నలభైయ్యవ సినిమా. యాభై సినిమాలను పూర్తి చేసిన తర్వాత కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే స్థితిలో లేను. ఇంకా పది సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా. నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. నా తరం కథానాయికల్లో ఎవరూ చేయని ఫీట్ చేయాలనేది నా తొలి లక్ష్యం. బాలీవుడ్‌లో నాకు ఎదురైన పరాజయానికి ప్రతిగా..అక్కడ భారీ విజయాన్ని అందుకుని అందరి చేత శభాష్ అనిపించుకోవాలనుంది. ఇది నా రెండవ లక్ష్యం. ఇక పోతే ఇక్కడ కూడా నాకు కొన్ని తీరని కోరికలున్నాయి. అవేటంటే సౌత్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేశాను. ఇటీవలే కమల్‌సార్‌తో కూడా నటించాను. ఇక రజనీసార్‌తో నటించాలి. అలాగే...మణిరత్నం దర్శకత్వంలో ‘యువ’లో నటించాను. కానీ అందులో ముగ్గురు నాయికల్లో నేను ఒకదాన్ని. అలా కాకుండా మణిసార్ దర్శకత్వంలో సోలో హీరోయిన్‌గా చేయాలి. ఇవన్నీ తీరాక, అప్పుడు రిటైర్మెంట్, పెళ్లి గురించి ఆలోచిస్తాను’అంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది చెన్నయ్ చందమామ త్రిష. ప్రస్తుతం త్రిష తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటితో పాటు మరో మూడు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం. సో..మీరప్పుడే త్రిష పెళ్లి గురించి ఏ మాత్రం ఆలోచించకండి.