Friday, September 9, 2011

గుడి కట్టాలి!

తమాషా కార్నర్

‘కందిరీగ’ సక్సెస్‌తో హన్సికకి మాట్లాడే ఛాన్సు చాలా వచ్చింది. ‘దేశముదురు’ తర్వాత తను తెలుగు సినిమాల్ని చూడలేదని చెప్పుకొచ్చింది. చూడకపోవడమే మంచిదైంది. వృత్తిపట్ల తన శ్రద్ధ ఇలా వుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇప్పుడు ‘కందిరీగ’ని కూడా చూసిందో లేదో తెలీదు. చూసి వుంటే, జూనియర్ నమితలా వున్న తనని చూసుకుని షాక్ తిని వుండాలి. ఈ షాక్‌తో ఇక జన్మలో తన సినిమాల్ని తను చూడదు. అయితే తన ఆకృతి గురించి వస్తున్న కామెంట్స్‌కి అసలు విషయం బోధపడి అర్జెంటుగా బాడీని తిరిగి నార్మల్ స్థితికి తెచ్చుకునేందుకు ఫారిన్‌టూరు కట్టింది. ఇది వేరే విషయం. తాజా సమాచారమేమిటంటే తమిళ ప్రేక్షకులు తనని చిన్న కుష్బూ అని ఆప్యాయంగా పిలుస్తున్నారని వెల్లడించింది. జూనియర్ నమిత పేరుతోనే అల్లకల్లోలం రేగితే, చిన్న కుష్బూ అనడం తమిళులకే చెల్లింది. ఇక మూడో విడత బులిటెన్‌లో ఈ చిన్న కుష్బూకి కుష్బూకి కట్టినట్టు గుడికూడా కడుతున్నట్టు ఓ బైట్ వదిల్తే మొత్తం హన్సిక వ్యవహారం ఓ లాజికల్ ఎండ్‌కొస్తుంది. పోలికలు చెప్పుకుని జీవించడం మానేస్తే హన్సిక హంసలా అలరించే అవకాశాలెక్కువున్నాయి.

ఇదిగో మల్టీస్టారర్స్!
తెలుగులో మల్టీస్టారర్స్ లేని లోటు తీర్చవచ్చు. అప్పుడప్పుడు వెంకటేష్-పవన్‌కళ్యాణ్ కలిసి నటిస్తున్నారనీ, లేదా నాగార్జున-బాలకృష్ణ కలిసి కనువిందు చేయనున్నారనీ వార్తలు వస్తుంటాయి. అవెప్పుడూ నిజం కావు. కారణాలేమైనా స్టార్లు ఇలాంటి కోరికలు తీర్చేందుకు సిద్ధంగా లేరు. ఈలోగా రిటైరైపోతారు. అయితే ఒక పని చేయవచ్చు. ఇద్దరు ముగ్గురు స్టార్స్‌ని ఒక సినిమాలో చూడాలని తీవ్రంగా తపిస్తున్న ప్రేక్షకులు కాస్త టెక్నాలజీ తెలిసి వుంటే ఇంటర్నెట్‌లో అలాంటి వీడియోలు సృష్టించి దుగ్ధ అంతా తీర్చుకోవచ్చు. టాలీవుడ్ నుంచీ హాలీవుడ్ దాకా ఎన్నో సినిమాలున్నాయి. వాటిలో సూపర్‌హిట్ సీన్లు తీసి మన స్టార్స్ తలభాగం మార్ఫింగ్ చేయడమే. ఈ మధ్యే ‘సింగం’ సినిమా విడుదలయ్యాక ‘మన్మోహన్ సింగం’ అనే మార్ఫింగ్ వీడియో మన ప్రధాని యాక్షన్ సీన్స్‌ని రోమాంచితంగా ఆవిష్కరించింది కదా? అలాగన్నమాట. ఇలాంటి పని ఆల్రెడీ ఇప్పుడు బాలీవుడ్ ఔత్సాహికులు చేసేసి ఇంటర్నెట్‌లో విర్రవీగుతున్నారు. ‘్ధమ్-3’ సినిమా ప్రకటన వెలువడిందో లేదో, తోచిన బాలీవుడ్ స్టార్స్‌ని పెట్టి మార్ఫింగ్ వీడియో చుట్టేసి ట్రైలర్‌గా వదిలేశారు. చూసిన అమాయకులు ఇది నిజమేనని నమ్మేస్తున్నారు.

బెజవాడ దడ?
నాగార్జునకి ఒక ‘గీతాంజలి’, నాగచైతన్యకి ఒక ‘ఏ మాయె చెసావె’...నాగార్జున ఒక ‘శివ’, నాగచైతన్యకి ఒక ‘బెజవాడ’గా పోలికలు తెచ్చిన ఏలికలు ‘దడ’ విడుదల తర్వాత దర్వాజా బంద్ చేసుకున్నారు. కారణం ‘దడ’లో చైతూ చేతలు యాక్షన్‌కి చాల్లేదు. అతను అంతటి మెరికల్లాంటి అమెరికన్లని కొడతాడంటే నమ్మబుద్ధి కాలేదు. చిట్ట చివర్లో యుద్ధానికి వెళ్తూ పలికిన పంచ్ డైలాగు కూడా తనలాగే వీక్‌గా వుంది. ఇప్పుడు ‘బెజవాడ’ వంతు వచ్చింది. అప్పుడే ఒక టీజర్ వదిలారు. అందులో చైతూ పంచ్ డైలాగు రుచి చూపించారు. ‘బెజవాడ నాదిరో, ముట్టుకుంటే పగిలిపోతుంది’ అని చైతూ పలికిన డైలాగు మళ్లీ ‘దడ’నే గుర్తుకు తెస్తున్న పరిస్థితి వుందని పండితులు పేలుతున్నారు. కానీ చైతూకొక సైఫ్ సైడ్ వుంది. ఫారిన్ కథ ‘దడ’కి ఈ సేఫ్ సైడ్ లేదు. ‘బెజవాడ’ అసలే ప్రారంభం నుంచీ వివాదాస్పదంగా మారింది. దీంతో ఇందులో విజయవాడ గురించి ఏం చూపించారో చూడాలన్న ఆత్రుతతో వున్నారు ప్రేక్షక జన సందోహం. ఆ రకంగా కిటకిటలాడి పోయే థియేటర్లతో దృష్టి అంతా విజయవాడ స్టోరీ మీదే తప్ప, చైతూ యాక్టింగ్ టాలెంట్స్ మీద వుండదు. కాబట్టి చైతూ ఈ సారికి చిరుతే కాదంటారా? *

* నాకూ... ఓ లవరుంది (బాగోలేదు)

-ఎం.డి., September 9th, 2011

తారాగణం:
కృష్ణుడు, రితిక, ఎం.ఎస్.నారాయణ
గీతాసింగ్, హేమ, అలీ, మాస్టర్ భరత్
తాగుబోతు రమేష్ తదితరులు
కెమెరా: ఎస్.డి.జాన్
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్
నిర్మాణం: శ్రీ శివపార్వతి కంబైన్స్
నిర్మాత: కె.సురేష్‌బాబు
దర్శకత్వం: ఎం.రాంవెంకీ

కథంటూ ఉంటే - ఏదో విధంగా గట్టుకి చేరొచ్చు. కేవలం ‘పర్సనాలిటీ’తో కామెడీ ట్రాక్ అంటే ఆలోచించాల్సిన విషయమే. ‘వినాయకుడు’ లేదా ‘విలేజ్‌లో వినాయకుడు’ ‘ఏం మాయ చేశావె’లో టన్నుల కొద్దీ అమాయకత్వాన్ని వొలకబోసిన కృష్ణుడు - పొరపాటునో గ్రహపాటునో ‘బొమ్మరిల్లు’ సెటైర్‌లో అనుకుంటే ఈ విధంగా అనుకొని ఉండొచ్చు. ‘అంతా మీరే చేశారు? ఏదో నా మానాన నేను ‘అమాయకుడి’ పాత్రలు వేసుకుంటూ ఇండస్ట్రీలో బతికేస్తూంటే - హీరో ఇమేజ్‌లో ఇరికిస్తానన్నారు? కానీ ఏం చేశారు?’ అని ప్రశ్నించుకుంటాడు. అసలు కథ అనే పదార్థానికి సరిపడిన పాళ్లు అస్సల్లేవు. భారీకాయాన్ని (?) పెళ్లి చేసుకుని ఏ అమ్మాయి మాత్రం సుఖపడుతుంది? ఒకవేళ ఏదో రీజనింగ్ దొరికి చేసుకుందే అనుకుందాం అన్న చిన్న కానె్సప్ట్‌తో అల్లుకున్న గజిబిజి కథలో అర్థంపర్థంలేని సన్నివేశాల గోల - క్లాస్ డెత్ బ్యూరో హేల వెరసి ఈ చిత్రాన్ని ‘పాడె’ మీద పడుకోబెట్టి శుభం కార్డుకి బదులు ‘డెత్’ కార్డు పడేశాయి.
కథకుడు కేసెట్ల మీద కేసెట్లు చూసే తరహా అనుకుంటా. ఆయా చిత్రాల ప్రభావం నుంచీ బయటపడలేక - కాళిదాసు కవిత్వం కొంత - నా పైత్యం కొంత అన్నట్టు - రీళ్లకి రీళ్లు మడతేశాడు. పైపెచ్చు ‘క్లాస్ డెత్ బ్యూరో’ అనే సబ్జెక్ట్‌ని తెరకెక్కించి వీళ్లేదో సమాజ సేవ చేసేస్తున్నట్టు బిల్డప్ తనకి తాను ఇచ్చేసుకుని కథని ‘పాడె’కి కట్టేస్తే ప్రేక్షకుడికి మిగిలేది కాటికాపరి బతుకే.
ఇది కథ కాదు వ్యధ. ఓంకార శాస్ర్తీ (ఎం.ఎస్.) పుత్రరత్నం కృష్ణశాస్ర్తీ (కృష్ణుడు). పగలంతా పరమ నిష్టాగరిష్టుడు. నిత్యం ధూప దీప నైవేద్యాల మధ్య - స్వామివారి సేవలో తరిస్తూంటాడు. కానీ యువ రక్తం.. మనసు చంచలం కదా. దేవాలయానికి వచ్చే అందమైన అమ్మాయిల్ని చూసినా.. పౌరోహిత్యం పేరిట పెళ్లిళ్లకు వెళితే అక్కడి కాంతమణుల్ని చూసినా - కలలు కనటం ఆనవాయితీ. ఇటువంటి చంచల స్వభావానికి ఆనకట్ట వేయలేక పోతాడు. చిట్టచివరికి ‘నాకూ ఓ లవరుంది’ అనిపించుకోవాలనుకుంటాడు. ఏది ఏమైతేనేం - ఒకానొక శుభ ముహూర్తంలో నీలిమ (రితిక) పరిచయమవుతుంది. అది స్నేహంగా మారుతుంది. ఆ స్నేహాన్ని ప్రేమ అనుకుంటాడు కృష్ణుడు. హీరో అన్న తర్వాత విలన్ లేకుంటే ఎలా? ఆ విలనే నీలిమ బావ. కృష్ణుడికి నీలిమకి మధ్య ఏ సన్నివేశం జరిగినా అది ప్రేమగా భ్రమిస్తూంటాడు కృష్ణుడు. మరోవైపు కృష్ణుడి మరదలు అంబుజాక్షిని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుబడతాడు ఓంకార శాస్ర్తీ. ఇదెటు తేలే వ్యవహారం కాదని.. నీలిమని ప్రేమిస్తున్నట్టు చెప్పలేక.. ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తుందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆత్మహత్యా నేపథ్యంలో ‘క్లాస్ డెత్ బ్యూరో’ ఇన్‌చార్జి పరిచయమవుతాడు. ఇంతలో కృష్ణుణ్ణి చంపేయమని ఐస్ రాజ్ (అలీ)ని నియమిస్తాడు నీలిమ బావ. ఇన్ని మలుపుల మధ్య కథ ఎక్కడికో వెళ్లిపోతుంది.
ఓంకార శాస్ర్తీ కేరెక్టర్‌ని మొదటి సన్నివేశంలోనే పిల్లల చేత ఛీ కొట్టించి.. రాన్రాను ఆ పాత్ర గంభీరాన్ని సంతరించుకోవటం చూస్తూంటే - కథకుడికి ఏ మాత్రం అవగాహన లేదనిపిస్తుంది. ఇదే కృష్ణుడి విషయంలోనూ జరిగింది. కేరెక్టర్‌లో అమాయకత్వం పాలు చాలావరకూ తగ్గిపోయింది. కృష్ణుడు డైలాగ్ డెలివరీలోనూ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌లోనూ ఏదో తెలీని లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది దర్శకుడి అవగాహనా రాహిత్యమే. ఇక ఐస్ రాజ్ కథ - ఆనాటి ‘పుష్పక విమానం’లో ఓ కేరెక్టర్‌ని పోలి ఉంటే - ‘బొమ్మరిల్లు’ సెటైర్.. లాంటివెన్నో మధ్యమధ్య పలకరిస్తూ - ప్రేక్షకుణ్ణి తాను చూస్తున్నది సినిమా కాదు - ఏ వీధి నాటకమో అనిపించేట్టు ఉంటుంది. సన్నివేశాలకు సన్నివేశాలు మరీ పేలవంగా సాగిపోతూంటాయి. దీనికి తోడు ఒక్క కృష్ణుడినే భరించలేక పోతున్నామంటే - కనిపించిన ప్రతి కేరెక్టర్ కేజీల కొద్దీ బరువుతో స్క్రీన్‌కి మరింత ‘నిండుదనాన్ని’ తెచ్చిపెట్టాయి. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అన్నట్టు ఎవర్ని చూసినా ‘్భరీ’ కాయాలే. ఇక చీప్ కామెడీ ట్రిక్స్ ప్రయోగంలో భాగంగా - ‘క్లాస్ డెత్ బ్యూరో’ని ప్రతిసారీ తెర మీదికి తేవటంతో ఒకింత స్మశాన వైరాగ్యం కలిగిన మాట వాస్తవం. వెనకటికి బాపు తన చిత్రం మీద తానే ‘యెటకారం’ చేసుకునే నిజాయితీని దర్శకుడు అక్కడక్కడ ప్రదర్శించటం చూస్తూంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందం.
తనని కాపాడాడన్న ఒకే ఒక్క కారణంతో - నీలిమ కృష్ణుణ్ణి పెళ్లి చేసుకోవటం అంత సమంజసంగా అనిపించలేదు. ఇన్ని సమస్యల నడుమ - కృష్ణుడితో అన్ని వేషాలు వేయించాల్సిన అవసరం ఉందా? కృష్ణుడి ముందు రితిక మరీ సన్నగా.. పిట్టకి మల్లే ఉంది.
హాస్యం పేరిట ‘వెకిలితనాన్ని’ వొలకబోసి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం ఈ తరహా కాదేమో?! ఏతావతా ఫస్ట్ఫా అంతా ఒకటో కృష్ణుడి ‘లవ్ ట్రాక్’ ఐతే - రెండో కృష్ణుడిగా వేణు ‘డెత్ ట్రాక్’ నడిచి ప్రేక్షకుల్ని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టింది.

Thursday, August 11, 2011

తమాషా కార్నర్

‘అయ్యారే...’ శివాజీ!

కాషాయ వస్తధ్రారి నిత్యానందస్వామి నీలి చిత్రాల క్రేజీనటుడయ్యాక, ఆ క్రేజ్‌ని వెండితెరమీద సొమ్ము చేసుకోవాలని ‘అయ్యారే’ తీశారు నిర్మాతలు. నిత్యానంద కోర్టుకెళ్లి స్టేయ్యారే అన్నాడు. స్టే వచ్చింది. సినిమా ఆగిపోయింది. తిరిగి ఎన్నాళ్లకో విడుదలవుతోంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని హీరో శివాజీ అసభ్యశ్రీ అవార్డు పుచ్చుకుందామని టీవీ ప్రేక్షకుల సాక్షిగా ముద్దు ముద్దుగా ముచ్చటగా బూతైన మాటలతో నిత్యానందలహరిలో తేలిపోయాడు. ఎదవ అన్నాడు నిత్యానందని. ఎవరూ వన్స్‌మోర్ అనకున్నా పదే పదే అన్నాడు. ఇంకేదో రాయడానికి వీల్లేని మాటని తనివితీరా అన్నాడు. లోకమంతా షాకై చూస్తోంది. నిత్యానంద నీలి దృశ్యాలకన్నా ఇదే అఫెన్సివ్‌గా ఉంది. సినిమాని ఆపే హక్కు నిత్యానందకి లేదట. సినిమా కోర్టు కదా ఆపింది. నిత్యానంద నీచుడైనంత మాత్రాన అతడికి హక్కులుండవనా శివాజీ భావం? నిత్యానంద లీలల్ని టీవీలో చూసి ఇన్‌స్పయిరై సినిమాలో నటించి శివాజీ, ఇప్పుడదే తను పేల్చిన అసభ్య పదజాలాన్ని నిత్యానంద టీవీలో చూసే ఉంటాడు. అతను శివాజీమీద ఇంకో సినిమా తీస్తే? దాని షూటింగ్ కోర్టులో జరిగితే?

తమిళ ముప్పు!
తమిళ హీరోలు తెలుగు వాళ్ల మధ్యకొచ్చి ప్రెస్‌మీట్లుపెట్టి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటూ క్రేజ్ పెంచుకోవడం తెలుగు స్టార్ల కొంప ముంచబోతోందా? సూర్య, విక్రమ్, కార్తీ లాంటి తమిళ స్టార్స్‌కి ఇప్పటికే తెలుగులో తెగ ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ లేకపోయినా తమిళ దర్శకులు, ఇతర టెక్నీషియన్లు తెలుగు ఫీల్డులో చొరబడుతూ తెలుగు దర్శకులకి, టెక్నీషియన్స్‌కి గుబులు పుట్టిస్తున్నారు. దీనిమీద సినిమా కథ దగ్గరనుంచీ విడుదల వరకు తాము ఆడింది ఆటగా సాగించుకునే తెలుగు స్టార్లెవరూ స్పందించలేదు. ఇప్పుడు వాళ్ల నెత్తిమీదకే వచ్చింది. ఈ తమిళస్టార్లు ఏవో డబ్బింగులతో క్రేజ్ పెంచుకుంటున్నార్లే అని సరిపెట్టుకుంటున్న తెలుగుస్టార్లు-ప్రత్యేకించి యువస్టార్లు అమాంతం పరస్పరం ఆరాలు తీస్తూ బేజారెత్తుతున్నారు. కారణం, ‘నాపేరు శివ’తో మళ్లీ వచ్చిన తమిళస్టార్ కార్తీ తెలుగులో నటిస్తాననడం! దీనికో నిర్మాతా ముందుకు రావడం! ఇక తమిళస్టార్లు తెలుగులో నటించేస్తే ఇంకేమైనా ఉందా...తెలుగులో వారసత్వాలతో వచ్చిన యువస్టార్లని తప్పించి మరే కొత్త మొహం చూసి తరించే ఛానే్సలేదు. వారసేతర కుర్రాడు స్టార్‌గా ఎదిగే స్కోపే లేదు. కానీ పక్కరాష్ట్రం నుంచి అమాంతం వెరైటీగా క్రేజ్ ఉన్న స్టార్ వచ్చేస్తే? ఇదిప్పుడు యువస్టార్లకి కంగారు పుట్టిస్తోందని ఫిలింనగర్ సమాచారం. ఏదో తప్పుచేస్తూంటేనే కంగారు పుట్టుకొస్తుంది...మూసపాత్రలతో మూస సినిమాలే లోకంగా జీవించడం తప్పే కదా? తమిళ స్టార్ వచ్చేసి ప్రయోగం చేస్తే, తెలుగు ప్రేక్షకులకి ఇష్టంగా వడ్డిస్తున్న పాత చింతకాయ సినిమాలేమైపోవాలి? మూసకి ఈ అన్యాయం జరగాల్సిందేనా! ఇక జీవించడమెలా టాలీవుడ్ తల్లీ?

ఇక డైలాగులు విడుదల!
సినిమా విడుదలవుతోంది. సినిమాకంటే ముం దు టైటిల్‌లోగో విడుదలవుతోంది. తర్వాత పాటలు విడుదలవుతాయి. ఆ తర్వాత ఫస్ట్‌లుక్ అంటూ కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ మొహాన పడేస్తారు. స్ప్లెండిడ్,
టెర్రిఫిక్, అదరగొట్టాడు అని స్టార్ ఫోజుల్ని చూసి మురిసిపోతారు ఫాన్స్. పోస్టర్ విడదలవుతుంది. వారెవ్వా అనుకుంటారు. అసలు లోగో విడుదలైనప్పుడు ఈ టైటిల్ డిజైన్ గురించే సినిమా ఎలా ఉండబోతోందో గంటలకొద్దీ చర్చించుకుంటారు. ఇక ఫొటోల తర్వాత టీజర్లు-అంటే ట్రయిలర్స్ అనే వాడుకలో ఉన్న పేరుగా స్టయిలుగా పెట్టుకున్న కొత్త పేరు- విడుదలవుతాయి. ఫస్ట్ టీజర్ విడుదల చేసి, రెస్పాన్స్ చూసి, దానికి మించిన సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారు. ఇందులో అభిమాన స్టార్‌ని చూసి ఫుల్ రేంజిలో రెచ్చిపోతారు. ఈ టీజర్స్‌లో ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది. అదే మెయిన్ ఎట్రాక్షన్. టీజర్ల పేరుతో పంచ్ డైలాగులు వినిపించడమే అసలు ఉద్దేశం. అలా ఫస్ట్ టీజర్‌తో ఒక డైలాగు పాపులర్ అయ్యాక, సెకండ్ టీజర్‌లో ఇంకోటి వదులుతారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు ‘దూకుడు’టీజర్లతో జరుగుతున్నదిదే. ఫస్ట్ టీజర్‌లో ‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లయిండ్‌గా వెళ్లిపోతా’ అని పంచ్ ఇచ్చుకున్నాడు ప్రిన్స్. మొనే్న విడుదల చేసిన సెకండ్ టీజర్‌లో ‘్భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అని పంక్చర్ చేశాడు. రాష్ట్రంలో నేలమీద ఉండే కామన్ అభిమానులని అలా ఉంచుదాం, ఇంటర్నెట్‌లో ఉండే ఎక్కడెక్కడి దేశాల నెటిజనులూ ఈ డైలాగులకి తెగ రెచ్చిపోతున్నారు. ఇలా లోగో దగ్గరనుంచీ డైలాగుల వరకూ రెచ్చగొట్టుకుంటూ వచ్చిన నిర్మాతలు తీరా సువిశాల వెండి తెరమీద ఏంచేస్తారో, ఏం తేలుస్తారో తెలీదు! షోలే, ముత్యాల ముగ్గు డైలాగుల్లాగా చరిత్రలో వాటికంటూ ఓ స్థానం రికార్డుల రూపంలో ఉంటుందో లేదో తెలీదు. వెయ్యి థియేటర్లలో రెండు వారాల తర్వత ఈ హడావుడి అంతా సద్దుమణిగి, దులుపుకుని వెళ్లిపోతారు.

Thursday, August 4, 2011

-ఎం.డి.అబ్దుల్

పెద్ద సినిమాలు వస్తున్నాయంటే ఆ హంగామానే వేరు. వసూళ్ల గురించి, సెంటర్ల గురించి, రికార్డుల గురించి మాట్లాడుకునేది అప్పుడే. పరిశ్రమ చూపు ఎప్పుడూ పెద్ద సినిమాలమీదే వుంటుంది. ఓ సినిమా విజయం పరిశ్రమను బతికిస్తుంది. అయితే గత కొంత కాలంగా సరైన హిట్స్‌లేక టాలీవుడ్ విలవిల్లాడిపోతోంది. బాక్సాఫీస్ కళ తప్పింది. ఉద్యమాల పుణ్యమా అంటూ చిత్ర నిర్మాణాల సంఖ్య బాగా తగ్గిపోవడంతో సినిమాలు లేక థియేటర్లు బోసిబోయాయి. ఇక అగ్ర హీరోల చిత్రాల జాడే లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ ‘బద్రినాథ్’, ఎన్‌టిఆర్ ‘శక్తి’ తాజాగా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాన్ని చవి చూశాయి. ఈ దశలో ఇప్పుడు పరిశ్రమ దృష్టి త్వరలో విడుదల కాబోతున్న పెద్ద సినిమాలమీదే నెలకొంది. ముందున్నది సినీ దసరా ముసురు. ఈ ముసురులో దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాల విడుదల కోసం ఆయా నటుల అభిమానులే కాదు, థియేటర్లూ ఎదురు చూస్తున్నాయి.

ఇప్పుడు రాబోయే ఐదునెలల కాలం ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తనుంది. క్రేజీ హీరోలు, క్రేజీ దర్శకుల చిత్రాలు కొన్ని విడుదలవుతుండడమే దీనికి కారణం. రామ్ ‘కందిరీగ’, నాగచైతన్య ‘దడ’, మహేష్‌బాబు ‘దూకు డు’, బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’, ఎన్‌టిఆర్ ‘ఊసరవెల్లి’, నాగార్జున ‘రా జన్న’, వెంకటేష్ ‘గంగ-ద బాడీగార్డ్’ రామ్‌చరణ్ ‘రచ్చ’తో పాటు గోపీచంద్ ‘మొగుడు’ విడుదలకు సై అంటూ ప్రేక్షకుల తీర్పును కోరడానికి సిద్ధంగా వున్నాయి. భారీ తారాగణమే కాదు, భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాల విషయానికొస్తే... ముందుగా ఈనెల 5న రామ్ హీరోగా నటించిన ‘కందిరీగ’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. వినోదాన్ని పండించడంతో పాటు తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్న రామ్ తొలి సినిమాతోనే తన నటనలో సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ‘జగ డం’తో మాస్‌ని మెప్పించాడు. రెడీ, గణేష్, మస్కా చిత్రాలు రామ్‌కు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ‘రామ రామ కృష్ణ కృష్ణ’ తర్వాత కొంచెం విరామం తీసుకుని ‘కందిరీగ’ చేశాడు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని చిత్రాలకు పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ ‘కందిరీగ’తో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ‘మస్కా’ తర్వాత రామ్-హన్సిక మరోసారి జోడీగా నటించగా, ‘యువత’ ఫేం అక్ష మరో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే బలమైన ఆయుధం. ‘రెడీ’ తర్వాత చెప్పుకోతగ్గ సినిమాల్లేని రామ్ ‘కందిరీగ’తో మంచి విజయాన్ని అందుకోవాలని తపిస్తున్నాడు. రామ్ కెరీర్‌లో ఈ చిత్రం తప్పకుండా ఓ మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ‘100%లవ్’ చిత్రం తర్వాత నాగచైతన్య నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘దడ’ సినిమా కోసం చాలా మందే వేచి చూస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ చిత్రంతో అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఓ అమ్మాయిని ఆపద నుంచి రక్షించే యువకుడిగా నాగచైతన్య ఈ చిత్రం కనిపించనున్నాడు. అమెరికా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తనకు మాస్ ఇమేజ్ రావడం ఖాయం అని నాగచైతన్య ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు. ‘ఖలేజా’ తర్వాత వస్తున్న మాహేష్‌బాబు ‘దూకుడు’కోసం ఆయన అభిమానులే కాదు, చాలా మంది ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈనెల 26న లేదా సెప్టెంబర్ తొలివారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘పోకిరి’ తర్వాత హిట్‌లేని మహేష్‌బాబు ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఇక సెప్టెంబర్‌లో బాబాయ్, అబ్బాయిల సినిమాలు ప్రేక్షకుల ముం దుకు రానున్నాయి. అవి బాలకృష్ణ- బాపుల ‘శ్రీరామరాజ్యం’, ఎన్‌టిఆర్ ‘ఊసరివెల్లి’. ‘చూడు...ఒక వైపే చూ డూ..’అంటూ గత ఏడాది ‘సిం హాం’లా గర్జించిన నందమూరి బాలకృష్ణ పౌరుషాన్ని చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అభిమానులు పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ కళకళలాడింది. అదే ఆశతో ఇప్పుడు మళ్లీ ‘శ్రీరామరాజ్యం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు బాలయ్య. ఇం దులో సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటిస్తున్నారు. అలనాటి అజరామర చిత్రం ‘లవకుశ’కు ఇది రీమేక్. ఈ చిత్రం అటు బాలయ్యకే కాదు, ఇటు నయనతారకు క్రేజీ ప్రాజెక్టేకావడం విశేషం. ఈ చిత్రంపై పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారీ విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం పరిశ్రమలో బలంగా వుంది. ఎన్‌టిఆర్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో మెగామూవీ ‘ఊసరవెల్లి’పై ఎన్నో అంచనాలున్నాయి. సాంకేతిక విషయాల్లో మంచి అవగాహన ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి. ‘అతనొక్కడే’ సినిమాలో అతని పనితీరు చూసి ‘అశోక్’లో అవకాశమిచ్చారు ఎన్‌టిఆర్. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా, సురేందర్‌రెడ్డి పాటించిన స్క్రీన్‌ప్లే టెక్నిక్ నచ్చడంతో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్‌టిఆర్ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ‘కిక్’ తర్వాత సురేందర్‌రెడ్డి సృజనాత్మకశక్తికీ, ఎన్‌టిఆర్ ఇమేజ్‌కీ ఓ పరీక్ష కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్క్‌బ్యూటీ తమన్నా హీరోయిన్. ‘రాఖీ’ తర్వాత ఎన్‌టిఆర్‌తో దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. ‘అదుర్స్’తో యాక్షన్ నుంచి ఎన్‌టిఆర్ వినోదం వైపు వస్తే, ‘కిక్’ తర్వాత సురేందర్‌రెడ్డి కూడా గేరు మార్చాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమన్న భారీ నమ్మకంతో ఇద్దరూ వున్నారు. అక్టోబర్‌లో ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి నాగార్జున నటిస్తున్న ‘రాజన్న’, వెంకటేష్ ‘గంగ-ది బాడీగార్డ్’. ‘రగడ’ వంటి కమర్షియల్ హిట్ , ‘గగనం’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత నటిస్తున్న ‘రాజన్న’ నాగార్జున కెరీర్‌లో మరో కీలకమైన చిత్రం కానుందని పరిశ్రమ చెబుతోంది. 1940-50 నాటి నేపథ్యంలో రజాకార్ల దురాగతాల మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ‘రాజన్న’ అనే పోరాట యోధుని కల్పిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వి.విజయేంద్రప్రసాద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలోని యాక్ష న్ సన్నివేశాల్ని ఆయన కుమారుడు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి తెరకెక్కిస్తున్నాడు. స్నేహ నాగార్జునకు జోడీగా నటిస్తున్న ఈ చిత్రం ఇటు నాగార్జునకు, అటు విజేయేంద్రప్రసాద్‌కు మంచి పేరుని తెచ్చిపెట్టి వసూళ్లు సాధిస్తుందన్న గట్టినమ్మకం వారిలో వుంది. ‘తులసి’ సినిమా తర్వాత సరైన విజయం లేక అల్లాడిపోతున్న వెంకటేష్ తాజాగా నటించిన సినిమా ‘గంగ-ద బాడీగార్డ్’. ‘డాన్ శీను’ ఫేం గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిషకు బాడీగార్డ్‌గా కనిపించనున్నారు వెంకటేష్. మలయాళంలో విజయం సాధించిన ‘బాడీగార్డ్’కు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా మంచి కమర్షియల్ హిట్ లభిస్తుందన్న నమ్మకం వెంకటేష్‌లోవుంది. రామ్‌చరణ్ ‘రచ్చ’ నవంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘ఏమైంది ఈవేళ’ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై రామ్‌చరణ్ పట్టుదలతో వున్నాడు. ‘మగధీర’ మెగా విజయం తర్వాత చేసిన ‘ఆరెంజ్’ అట్టర్‌ఫ్లాప్ కావడంతో కలత చెందిన రామ్‌చరణ్ ఈ ప్రాజెక్టుపై ఎంతో శ్రద్ధపెట్టారు. ప్రేమకథతో పాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్‌ని పరిచయం చేస్తూ ‘దిల్’రాజు నిర్మిస్తున్న ‘ఓ మై ఫ్రెండ్’ సైతం నవంబర్ లేదా డిసెంబర్ తొలి వారంలో విడుదలకానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తున్న ‘రేయ్’కూడా విడుదలకు సిద్ధమవుతోంది. స్వీయ నిర్మాణంలో బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్.చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘దేవదాసు’ చిత్రం తర్వాత తీసిన చిత్రాలన్నీ అట్టర్‌ఫ్లాపై అటకెక్కడంతో వైవిఎస్ ఈ సినిమాపై ఎంతో శ్రద్ధపెట్టాడు. శుభ్ర అయ్యప్ప హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం హీరో సాయికి మంచి పేరు తెచ్చిపెడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ యాక్షన్ సినిమాతో మగాడిగా కనిపించిన గోపీచంద్ డిసెంబర్‌లో ‘మొగుడు’గా దర్శనమివ్వబోతున్నాడు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తుండగా, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణవంశీ అంటే కుటుంబ బంధాలు, అందులోని భావోద్వేగాలకు పెద్ద పీట వేసే సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ శైలి వేరు. ఆయన నుంచి ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన సినిమాలను ఆశిస్తారు. ఈ రెండూ కలగలిపి ఈ చిత్రం వుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇదే డిసెంబర్‌లోనే లారెన్స్ దర్శకత్వంలో కృష్ణంరాజు, ప్రభాస్ నటిస్తున్న ‘రెబల్’, శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘్ఢమరుకం’, పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాళీ’లు కూడా విడుదల కానున్నాయి.
సినిమా సినిమాకీ పెరిగిపోతున్న అంచనాల భారం మోయడం ఎవరికైనా తలకు మించిన పనే! ప్రతి సినిమాకీ అభిమానుల ఆశల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. వాళ్లకు కావల్సిన అంశాలను మేళవిస్తూనే కథలను ఎంచుకోవాలి. అన్ని సార్లూ ఈ ఫార్ములా పనిచేయకపోవచ్చు. కానీ కథానాయకుడిగా తన మీద పెట్టి బాధ్యతను మాత్రం నూటికి నూరుపాళ్లూ నెరవేర్చడమన్నది కథానాయకుడికి వుండాల్సిన లక్షణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్మించిన చిత్రాలే బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తాయి. ఈ అంశాలను విస్మరించిన చిత్రాలు టపా కట్టేస్తాయి. ఇలా ఇప్పుడు భారీ పెట్టుబడులతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాల్లో ఎన్ని విజయాన్ని సాధించి పరిశ్రమకు ఊపిరిపోస్తాయో, మరెన్ని అపజయాల పాలై నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతాయో చూడాల్సిందే. *

తమాషా కార్నర్

‘సెగ’ తగిలింది!

యువస్టార్ నాని నిర్మాతలతో ‘అష్టాచెమ్మా’ ఆడుకుంటున్నట్టుంది. అవును మరి, కాలం కలిసి వస్తే కావలసిన వాళ్లు కోన్‌కిస్కా అయిపోతారు. ఏ ముహూర్తాన ‘ఈగ’వచ్చి తన మీద వాలిందో, నిర్మాతలు దోమలై పోతున్నారు. ‘అలా.. మొదలైంది’వరకూ తన సినిమాల బడ్జెట్ మూడు కోట్లలోపే. దీన్ని ఎస్.ఎస్.రాజవౌళి ‘ఈగ’తో పది కోట్లకి పెంచినట్టు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నాని పదికోట్లకి తక్కువ బడ్జెట్ సినిమా చెయ్యనంటున్నాడు. అబ్బాయికి మంచి మార్కెట్ వుంది. చిన్న నిర్మాతలకి చేతులనిండా కలెక్షన్లు తెచ్చిపోస్తాడనుకుని కులుకుతూ వెళ్తే, తేరుకోలేని షాకిస్తున్నాడు. సరే, బడ్జెట్లగోల అలా వుంచితే, తాజాగా పారితోషికాల పరేషానీ తెచ్చాడని చెప్పుకుంటున్నారు ఫిలింనగర్లో. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అలా...మొదలైంది’కి 20 లక్షలు తీసుకుంటే, ‘ఈగ’కి 50 లక్షలు ముట్టాయి. అయితే ఎప్పుడైతే ‘అలా..మొదలైంది’ హిట్టయిందో, ఇక కోటి కావాలని కంగారు పుట్టించేస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘సెగ’ పరాజయంతో అబ్బాయికి భలే ‘సెగ’తగిలిందని, ఇక దిగి వస్తాడని అందరూ అనుకుంటున్నారు.

లైను చెబితే పిచ్చోడు!
స్క్రిప్టుమీద ఆరునెలలు కూర్చున్నాం, పది నెలలు పడుకున్నాం అని తరచు పరిశ్రమలో స్టేట్‌మెంట్లు విన్పిస్తుంటాయి. ఇవి దర్శకులో, నిర్మాతలో చెప్పే మాటలు. ఇవన్నీ స్టార్స్‌తో ‘లైను’ ఓకే చేయించుకున్నాక చేసే పనులు. ముందు లైను, తర్వాత కథమీద యోగాసనాలు వేసే పద్ధతి చాలా కాలంగా అమల్లో వుంది. ఇంతలో కొందరు స్టార్స్‌కి ఏమైందో ఏమోగానీ-లైను కాదు, పూర్తి స్క్రిప్టుతో రావాలని ఫర్మానా జారీ చేస్తున్నారు. జూనియర్ ఎన్‌టిఆర్‌తో, రవితేజతో ఈ అనుభవాలే ఎదురయ్యాక కొందరు టాప్ డైరెక్టర్లు కంగుతిని వెనక్కిపోయారు. లైను చెప్పేసి స్టార్ డేట్లు ఈజీగా సంపాదించే సరదా ఆటకి బ్రేకుపడి, ముందే స్క్రిప్టుమీద కూర్చుని, పడుకుని, తిప్పలుపడి ఆ కష్ట ఫలితంతో స్టార్ సుముఖానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి పడింది. పవన్‌కళ్యాణ్‌తో కూడా ఈ ముందస్తు కాయకష్టం తప్పడంలేదని వినికిడి. ఈ స్టార్లు ఏడాదికో సినిమా పద్ధతికి పాల్పడుతున్నప్పుడు ‘లైను’మీద లైనుకి రావడం కుదిరింది గానీ, ఇప్పుడు ఏడాదికి మూడు సినిమాల స్క్రీముకి తెరతీస్తున్నందున, వెంట వెంటనే ఫుల్‌స్క్రిప్టులవసరం. అప్పుడే ఫుల్ భోజనం దర్శకులకి. లేకపోతే ఆకలి దప్పులతో ఫిలింనగర్ వీధుల్లో ‘‘ఆకలై లైను చెబితే పిచ్చోడన్నారు స్టార్లు’’ అని పాడుకోవడమే!

టాలీఫుడ్డేమిటి?
ఈ ప్రశ్న అమాయకులు వేస్తారు. టాలీవుడ్‌లో ఏం ఫుడ్ తింటారంటే, అనేక మంది ధవళకాంతులీనే హోమియోపతీలాంటి చిన్న చిన్న పాలిథిన్ పొట్లాల్లో లభించే కొకైన్ తింటారని గత సంవత్సరకాలంగా మీడియా కోడై కూస్తోంది. ఒక గ్రాము మూడు వేల రూపాయలు. తాజాగా నల్ల జాతీయుల నుంచి ఈ తెల్ల పదార్థం తను శాయశక్తులా ముట్టుకోలేదని యువస్టార్ ‘వరుణ సందేశ’ మిచ్చాడు. కావాలంటే రక్తదానానికి-సారీ రక్త పరీక్షకి రెడీ అంటున్నాడు. తను బాక్సాఫీస్ పరీక్షకి సరిగ్గా ఎదురొడ్డి నిలబడి వుంటే ఈ రక్త పరీక్ష విషమ పరిస్థితి వచ్చేదికాదు. తొమ్మిదిలో ఆరు సినిమాలు ఫ్లాపయి మార్కెట్ పోగొట్టుకున్నది చాలక, డ్రగ్ కేసులో ఇరుక్కుంటే హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వేలం వెర్రి అభిమాన ప్రేక్షకులకి ఏం సందేశమిస్తున్నట్టు. ‘కుర్రాడు’లో భూస్థాపితమైన మోటార్ సైకిల్ కోసం పోరాటం చేసినట్టు, ఇప్పుడు ఎనె్నన్ని సాక్ష్యాల్ని భూస్థాపితం చేయాలి...హీరోయిజం వికటిస్తే రేపు పోలీసుల పాలీగ్రాఫ్ యంత్రాన్ని కూడా అపహరించుకుపోవాల్సి రావచ్చు. తను రక్తపరీక్ష అంటుంటే, పోలీసులు పాలీగ్రాఫ్ పరీక్ష కోసం కోర్టుకెళ్లారు. అలాగే దానికి తగిన భద్రత కోసం కూడా అర్జీపెట్టుకుంటే మంచిదేమో! *

Friday, July 29, 2011

అజయ్‌కి ఛాలెంజ్!

బాలీవుడ్‌లో ఇప్పుడు అబ్బాయిలే వున్నారనీ, మగాళ్లు లేరనీ యాక్షన్ హీరో అజయ్‌దేవగన్ చేసిన కామెంట్‌ని మన యువ హీరో తనీష్ ఛాలెంజి చేస్తున్నాడా? అజయ్ దేవగన్ చెప్పిన మగాడుగా తనొకడు టాలీవుడ్‌లో ఉన్నట్టు తన బాడీని పెంచి పోషిస్తున్నాడా? ‘కోడిపుంజు’లో అమాంతం తెగ లావెక్కిపోయిన తనీష్‌ని చూస్తే ఇది నిజమేనన్పిస్తుంది. బాలీవుడ్‌లో అబ్బాయిల సినిమాలు కేవలం మల్టీప్లెక్స్‌ల్లోనే ఆడతాయని, అలా కాక తనలాంటి, సల్మాన్ ఖాన్‌లాంటి సీనియర్ల సినిమాలు అన్ని సెంటర్లలో ఆడతాయనీ సెలవిచ్చాడు అజయ్‌దేవగన్. ఒక కమర్షియల్ ఎస్సై పాత్రనో, మాఫియా పాత్రనో పోషించాలంటే కనీసం ఇరవై ఏళ్ల సీనియారిటీ ఉండాలని, అబ్బాయిలు ఇక్కడే ఫెయిలవుతారనీ అజయ్ ఎనాలసిస్. నిన్న మొన్నటివరకు టీనేజ్ శరీరంతో ప్రేమ సినిమాలు చేసుకుంటున్న తనీష్‌కి ఒక్కసారిగా మగాడుగా ఎదిగిపోయి మాస్ సినిమాలు చేయాలని బుద్ధిపుట్టిన మాట అతనే ఒప్పుకున్నాడు. దీని రిజల్టు-టీనేజీ ఫేసుతో వస్తాదుబాడీ! ‘కోడిపుంజు’లో ఒంటి చేత్తో రౌడీల బాడీలు హూనం! స్థూలకాయంతో పడలేక జూనియర్ ఎన్టీఆర్, విష్ణు లాంటి యంగ్‌స్టార్సే సన్నబడుతుంటే, తనీష్ లాంటి లేత కుర్రాడు ఇలా పూరీలా విపరీతంగా ఉబ్బిపోవడం బాగా ఎబ్బెట్టుగానే ఉంది సినిమాలో!

రెండో ఆటకి రెడీ!
టాలీవుడ్‌లో కొత్త సీజన్ వచ్చి చేరింది. ఆనవాయితీగా ఉండే సంక్రాంతి, సమ్మర్ సెలవుల సీజన్‌లతోపాటు, గత సంవత్సరంనుంచీ దసరా సీజన్ కూడా ప్రారంభించారు. దసరాకి ‘ఖలేజా’తో మహేష్‌బాబు, ‘పులి’తో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ‘బృందావనం’ విడుదల చేసి బాక్సాఫీస్‌ని టెస్ట్ చేశారు. మొదటిరెండూ టెస్టులో వూస్టయిపోగా, చివరిది ఓ మాదిరిగా తేలి బ్యాడ్ టేస్టుని మిగిల్చాయి. అయినా మళ్లీ దసరాకి రెండో ఆటకి రెడీ అవుతున్నారు. మహేష్‌బాబు ‘దూకుడు’, పవన్ కల్యాణ్ ‘కాళి’, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి‘ మాత్రమే కాక, కాస్త డెలివరీ పెంచుదామని బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’, నాగార్జున ‘రాజన్న’, వెంకటేష్ ‘బాడీగార్డ్’లని కూడా బరిలోకి దింపుతున్నారు. బరిలో రంగహరీ... అంటూ దసరా సంబరాలకి వచ్చేస్తున్న ఈ ఆరు సినిమాల పెట్టుబడిని (దాదాపు 200 కోట్లు) మేమెక్కడనుంచి తెచ్చి సర్దాలని అప్పుడే ప్రేక్షకులు బెంబేలెత్తిపోవచ్చు. మా డబ్బుతో మమ్మల్ని పండగ కూడా చేసుకోనివ్వరా అని శోకాలు పెట్టవచ్చు. అదేం కుదర్దు. టాలీవుడ్ ప్రేక్షకులేం కోరుకుంటున్నారో అదివ్వదు. అదేం ఇవ్వాలనుకుంటోందో అదే ఇస్తుంది. దసరాకి ఆరు సినిమాల్ని హిట్ చేయకపోతే మళ్లీ దసరాకి 12 సినిమాలతో అంతు చూస్తుంది జాగ్రత్త!

అప్పుల్లో ఫ్లాపులు!
ఒక విషయంలో పూరీ జగన్నాధ్‌ని ఒప్పుకోవాలి. తను అప్పుల పాలు కావడంవల్లే హిట్లు ఇవ్వలేకపోయానని ఆయన నిజాయితీగా ప్రకటించాడు. పూరీ కంటే ముందు అప్పులపాలైన తేజ ఇలా ఒప్పుకోలేదు. పైగా ‘నిజం’ దగ్గర్నుంచీ ‘కేక’ వరకు చతికిలబడి, తిరిగి కొత్త సినిమాతో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఆర్థిక బాధలు తీరాయో లేదో గానీ, తిరిగి మొదటికొచ్చి కొత్తవారితో యూత్ సినిమాకి తన క్రియేటివ్ పవర్స్‌ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. మరోవైపు ‘దేశముదురు’ అనే హిట్ తర్వాత నిన్నటి ‘నేనూ నా రాక్షసి’ వరకు ఆరేడు సినిమాలు రాక్షసంగా ఫ్లాపయ్యాక, ‘బుడ్డా హోగా తేరే బాప్’ తో ముఖంలో ఆనందరేఖలు విలసిల్లి ఇప్పుడు ఆర్థిక బాధలు లేవుకాబట్టి ‘బిజినెస్ మాన్’ని బిగ్ హిట్ చేస్తానంటున్నాడు పూరీ. దర్శకులు సినిమా బిజినెస్ కూడా చేస్తే ఏమవుతుందో వీళ్లద్దరే ఉదాహరణ. క్రియేటివ్ పవర్స్ అన్నీ అవకతవక బిజినెస్ కష్టాల్లోంచి బయటపడేందుకే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. జేబు ఖాళీ అయిందని బుర్ర ఇలా ఖాళీ చేసుకుంటే దర్శకత్వానికేం మిగులుతుంది? అంత దూరం వెళ్లనవసరం లేదు. సకాలంలో స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకోలేక, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకుని బుర్రంతా వాటిమీదపెట్టుకునే దర్శకుల పనీ ఇంతే అవుతోంది. ఇది చూస్తూ నిర్మాతలు నట్టేట మునిగి ‘బచావ్ బచావ్’ అని కేకలేస్తున్నారు!

పందెం నెగ్గని పుంజు!

md abdul

* కోడిపుంజు (బాగోలేదు)
తారాగణం:
తనీష్, శోభన
రోజా, శివకృష్ణ
శ్రీధర్, ఎమ్మెస్ నారాయణ
రాజ్యలక్ష్మి, సత్యప్రకాష్
రాళ్లపల్లి తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: శివకుమార్
నిర్మాణం:
శ్రీ శైలేంద్ర సినిమాస్
నిర్మాత: ఎస్.ఎస్.బుజ్జిబాబు
దర్శకత్వం: బి.వి.వి.చౌదరి

ఓ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించే తీరిక నేటి తరానికి లేదు. నచ్చింది చేసేస్తారు. కొన్ని సార్లు పంతాలకు పోయి ఇబ్బందుల్లో పడతారు. కానీ అన్నిసార్లు చేతులు కట్టుకుని కూర్చోవడం కుదరదు. ఆవేశంతో అడుగేస్తేనే లక్ష్యాలు నెరవేరతాయి. అనుకున్న లక్ష్యం కోసం పందెం ‘కోడిపుంజు’లా తెగువ చూపిన కుర్రాడి కథే ఈ చిత్రం. తెలుగు సినిమాని గత ఏడాది కాలంగా పరిశీలిస్తే విడుదలవుతున్న సినిమాలు ఏ మేరకు సొమ్ములు తీసుకొస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎక్కువ శాతం పరాజయానే్న చవిచూస్తున్నాయి. లాజిక్కులేని కథలు, మూస ధోరణిలో సన్నివేశాలు, నవ్వించని కామెడీ ట్రాకులు, కొత్తదనం పేరుతో విపరీత ధోరణులు...ఇవి ప్రేక్షకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నది చిత్రసీమ మీద ఒట్టేసి చెప్పే నిజం. తెలుగు సినిమాలో కథ అనేది బ్రహ్మపదార్థం. అది వుంటే వుంది అనుకోవాలి. లేదు అంటే లేదు అనుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది ఈ ‘కోడిపుంజు’ విషయంలో.
కథలోకి వెళితే...తండ్రికి తగ్గ తనయుడు అనే మాట విన్నాం. కానీ తల్లికి తగ్గ తనయుడనేది మనం చాలా తక్కువ విన్నాం. ఈ కోవకి చెందిన యువకుడే అభిమన్యు (తనీష్). తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా)గారి అబ్బాయి అంటే చాలు. తల్లి చూసి రమ్మంటే పీకి వచ్చే రకం. తల్లి నుంచి వారసత్వంగా ఆస్తితో పాటు కావలసినంత పొగరు వచ్చింది. కొడుకుతో తొడగొట్టించి మరీ కయ్యానికి పంపే ఘటికురాలు సీతారత్నం. పెద్ద కత్తి సంచిలో పెట్టుకుని మోపెడ్ మీద తిరుగుతుంటుంది. తేడా వస్తే కత్తితో తిరగబడుతుంది. సీతారత్నం భర్త వ్యవసాయంలో నష్టమొచ్చి ఆత్మహత్య చేసుకుంటే, తనే వ్యవసాయధారిణిగా మారి రెండు ఎకరాలని ఇరవై ఎకరాలు చేసింది. కొడుకుని మంచి చదువులు చదివించి మంచి ప్రయోజకుడిని చేసింది. ఇలా వుంటే తూర్పుగోదావరి జిల్లాలో ‘రామరాజు లంక’ అనే గ్రామం. ఆ గ్రామ ప్రెసిడెంట్ రామచంద్రరావు (శివకృష్ణ) దాన ధర్మాలలో అందె వేసిన చేయి. ఆ విషయంలో ఎంతో పేరు సంపాదిస్తాడు. తన ఐదు వందల ఎకరాలని యాభై ఎకరాలు చేశాడు. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైతే, చిన్న అమ్మాయి నందిని (శోభన) ఇక్కడే చదువుకుంటోంది. అదే గ్రామంలో రామచంద్రరావు కుర్చీ మీద కనే్నసి వున్నాడు అల్లూరి బాపీనీడు (సత్యప్రకాష్). ఇతని తమ్ముడు నాగినీడు రామచంద్రరావు కూతురి మీద కనే్నశాడు. ఒకానొక సమయంలో నందినీని టీజ్ చేసిన నాగినీడుని వీరబాదుడు బాదుతాడు అభిమన్యు. ఆ సమయంలో అతడి కండ బలం చూసిన నందిని అతడి ప్రేమలో పడుతుంది. ఈ విషయంలో నాగినీడుతో చాలా సమస్యలు వస్తాయి. అతను దగ్గరవ్వడం, అతన్ని క్షమించి అభిమన్యు తన గ్రూపులో చేర్చుకోవడం ఆమెకి నచ్చదు. అయితే అభిమన్యు-నందినీల ప్రేమ ఇటు సీతారత్నంకి, అటు నందిని తల్లి (రాజ్యలక్ష్మి)కి తెలిసిపోతుంది. పిల్లల ప్రేమను కాదనలేక ఎంతో సంతోషంతో ఇద్దరూ అంగీకారం తెలుపుతారు. ఓ రోజు శ్రీరామనవమి సందర్భంగా నందినితో అభిమన్యు పందెం కాసి, ఆ దరిమిలా ఆమె తండ్రి కంటపడిపోతాడు. తన కూతురితో అతడి ప్రవర్తనకి మండిపడి అభిమన్యు తల్లి సీతారత్నం క్యారెక్టర్‌పై కూడా నిందారోపణలు చేస్తాడు. ఈ ఆరోపణలకు ఆవేశం ఆపుకోలేని అభిమన్యు ఆత్మాభిమానం దెబ్బతిని ‘మీ కూతుర్ని తన వశం చేసుకుంటా. ఎన్నికలలో నవ్వు పరాజయం పొందేలా చూసి నీ పరువుతీస్తా’ అని సవాల్ విసురుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు సిసలైన ‘కోడిపుంజు’ క్లైమాక్స్.
ఈ సినిమాని పూర్తి మాస్ అనుకుని చూస్తే సగం వరకే అలాంటి అనుభూతి కలుగుతుంది. దర్శకుడు బి.వి.వి చౌదరి ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేకపోగా, చూసే ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. సినిమాల్లో ఓ సూత్రం వుంది. కొత్త కథను అర్థమయ్యేలా చెప్పాలి. పాత కథను కొత్తగా చెప్పాలి. ఇది చాలా వరకు ఫలితాన్నిచ్చే సూత్రమే. ఎందుకంటే మన దర్శకులు చాలా వరకూ పాత కథల్నే వండిస్తూ తాళింపు, మసాలాల్లో చూపే తేడా వల్లే ప్రేక్షకులు కూసింత కొత్త దనాన్ని ఫీలవుతుంటారు. కానీ ఈ ‘కోడిపుంజు’లో ఆ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ‘దమ్మున్నోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన చౌదరి ఈ ‘కోడిపుంజు’ని పందెం నెగ్గేలా తీర్చిదిద్దలేకపోయాడు. రొటీన్ కథనే తీసుకున్నా, అందులో అతడి ప్రతిభని ఏ మాత్రం చూపించలేకపోయాడు. కాలం చెల్లిన కథే అయినా దాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. చిత్ర ప్రథమార్థంలోతెచ్చిన టెంపోని దర్శకుడి ద్వితీయార్థంలో చూపించలేక చతికిల పడ్డాడు. విశ్రాంతిలో హీరో చేసిన ఛాలెంజ్‌లు ద్వితీయార్థంలో పూర్తిగా మరచిపోయారు. దీంతో కథంతా గజిబిజిగా సాగి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది.
ఇక నటీనటుల విషయానికొస్తే...లవర్‌బాయ్ ఇమేజ్‌ను వదిలి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో బాడీని విపరీతంగా పెంచేసుకుని స్థూలకాయుడిలా మారిపోయిన తనీష్ తన పాత్రకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఎమోషనల్‌గా వుంటూనే సీతారత్నంలా రోజా అభినయం మెచ్చుకోతగ్గది. ఇలాంటి పాత్రలు ఆమెకు అతి సులువైనవే. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కొత్తనటి శోభన సోసోగానే చేసింది. ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా బాగా పండించాల్సింది. మిగతా నటీనటుల సంగతి సరేసరి. సంగీతం విషయానికొస్తే అనూప్ రూబెన్స్ బాణీలు అంతగా ఆకట్టుకోలేదు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ‘వాలే వాలే..వయసే వాలే..’ తనీష్, మధుశర్మలపై ఒకే ఒక్క పాట మాస్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు కెమెరా వర్క్‌ని అందించిన బి.శివకుమార్‌ని మెచ్చుకోకుండా వుండలేం. తన వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహించారు. మాటల విషయానికొస్తే...రోజా కొడుకుతో ‘కమ్మెయ్, చంపేయ్, నరికేయ్ అని నిన్ను కోడిపుంజులా పెంచానని చెప్పడం, కోపంగా వున్న ప్రతీసారి హీరో ‘నా పేరు అభిమన్యు..సన్నాఫ్ దగ్గుబాటి సీతారత్నం’ అని చెప్పడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఎడిటింగ్ సోసోనే. మొత్తం మీద ఓ నాసిరకమైన కథను ఎంచుకోవడమేగాక, పసలేని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల మీదికి వదిలిన ఈ ‘కోడిపుంజు’ పందెంలో ఏ మాత్రం నెగ్గలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనీష్ కథల విషయంలో ఇకనైనా జాగ్రత్త వహిస్తే బావుంటుంది.

Friday, July 22, 2011

నటన తార?

తమాషా కార్నర్

సినిమాల్లో నటన విరమించుకుంటున్నానని చెప్పి అద్భుతమైన వీడ్కోలు దృశ్యం సృష్టించి తీరా జీవితంలో నటించడం మొదలుపెడితే ఆ నటీమణికి ‘నటనతార’ బిరుదు ఇవ్వాల్సిందే. మనం చెప్పుకుంటున్నది నయనతార గురించి. ‘శ్రీరామరాజ్యం’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుని, యూనిట్ సభ్యులకి వాచీలు పంచిచ్చి అందరి హృదయాలూ బరువెక్కించి నిష్క్రమించింది. దీనర్ధం ఆమె ప్రభుదేవాని వివాహం చే సుకుని సినిమాలకి స్వస్తి చెబుతున్నట్టు అని సహజంగానే మీడియాలో ప్రచారమైంది. అది వివాహానికి ప్రభుదేవా పెట్టిన షరతు అన్నారు. సన్నివేశం, దానికి తగ్గ వ్యాఖ్యానంగానే ఈ మొత్తం వ్యవహారం కనిపించింది. తీరా ఈ మంగళవారం నయనతార దీన్ని ఖండించింది. తనకి సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనే లేదని, ఈ వార్తలెలా ప్రచారంలోకి వచ్చాయో తెలియడంలేదని వాపోయింది. ఇప్పుడు ఎవరు తెల్లబోవాలి-మీడియానా? అసలు నయనతార సెట్లో అలాంటి టచింగ్ సీన్ ఎందుకు క్రియేట్ చేసింది? ఏ సినిమా ముగింపు సందర్భంగానూ అలాచేయలేదే? ఇంతకీ ఆమె నయనతారా? లేక నటనతారా? అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. కాస్సేపు జుట్టు పీక్కుందాం!

స్టార్లు కావలెను!

చిన్న కథలు రాసుకుని చిన్న నిర్మాతల్ని సంప్రదిస్తున్న దర్శకులకి వింత అనుభవం ఎదురవుతోంది. చిన్న నిర్మాత కూడా పెద్ద స్టార్‌ని అడుగుతున్నాడు. చిన్న హీరోలతో, కొత్తవాళ్లతో తీస్తే 30 శాతం ఓపెనింగ్స్ కూడా రావడంలేదు. తీసి ఏం లాభమని పెదవి (ప్రపోజల్స్) విరుస్తున్నారు. ఛిద్రమైన ప్రపోజల్స్‌తో దర్శకులు తిరిగి వస్తున్నారు. పోనీ పబ్లిసిటీ, పంపిణీ నెట్‌వర్క్స్ బాగా ఉన్న అగ్రనిర్మాతల దగ్గరికి పోదామంటే ఆ చిన్న సినిమాతో వాళ్లకే పేరొస్తుంది తప్ప దర్శకుడికి మళ్లీ సినిమా రాదు. ఇక కొత్తగా వచ్చే నిర్మాతలే బెటర్ అనుకుంటే అలా వస్తున్న వాళ్లు అతి తక్కువమంది, దర్శకులు ఎక్కువమంది. డిమాండ్-సప్లై పరిస్థితి ఈ తీరున ఉంటే ఇంకా ఎటువైపు చూడాలి? ఎంతకాలం ఎదురు చూడాలి? చిన్న నిర్మాతలు కూడా స్టార్స్ కావాలంటుంటే చిన్న చిన్న హీరోలు ఏమైపోవాలి? నాని లాంటి చిన్న హీరోలని కూడా రాజవౌళిలాంటి టాప్ దర్శకులు లాగేస్తుంటే, వాళ్లు అందకుండా అమాంతం స్టార్లు అయిపోతున్నారు. ఇంకేం చెయ్యాలి? ఇంకేం చేయనక్కర్లేదు, చిన్న సినిమాల్ని చిన్న నిర్మాతలే బతకనిచ్చే రోజుల్లేవని, వాళ్లు స్టార్ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయాల్సిందేనని ఓ దర్శకుడి విసురు!

మల్టీషాక్?

సింగిల్‌స్టార్ సినిమాలు సింగిల్‌స్టార్ రివ్యూలకి నోచుకుంటున్న గడ్డు పరిస్థితుల్లో మల్టీ స్టారర్ సినిమాలైనా రావాలని-అలా బాలీవుడ్‌కి దగ్గరగా చేరి జాతి జీవన స్రవంతిలో కలవాలనీ బయ్యర్ల దగ్గరనుంచి ప్రేక్షకుల వరకు ఆశించడంలో తప్పులేదు. అదిగో అందుకే స్టార్ నిర్మాత దిల్‌రాజు అలాంటి మల్టీస్టార్ కల సాకారమయ్యేందుకు విక్టరీ వెంకటేష్‌నీ-పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌నీ ఒక దగ్గర చేర్చి హమ్మయ్య అనుకున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా హమ్మయ్యా అనుకునేంతలో సమ్-అయ్య మిస్సయ్యాడు! ఎవరా అని చూస్తే పవన్‌కల్యాణ్! తను టాటా చెప్పేసి తన పవర్ వేరే సినిమాకి చూపిస్తుంటే షాకైన నిర్మాతకి దర్శకుడికి మళ్లీ మొదటకొచ్చింది. ఈసారి ప్రిన్స్ మహేష్‌బాబుని మిస్సింగ్ ప్లేసులోకి తెచ్చుకున్నారు. ఇది కూడా మిస్సింగ్ కేసు కాకూడదని ప్రార్ధిస్తున్నారు. కానీ ముందుంది ‘దూకుడు’. మహేష్‌బాబు ‘దూకుడు’ విడుదలయ్యాక దాని ఫలితాలెలా ఉంటాయో, బాబు మైండ్ సెట్ ఎలా మారి ఎలా మరో మల్టీషాకు తగులు తుందోనన్న ఆందోళనతో ఫిలింనగర్ పరిసరాల్లో పనీపాటా లేని వర్గాలు తిండి తిప్పలు మానేసి గడుపుతున్నాయి. ఫ్యాన్స్‌కి లేని దురద వీళ్లకెందుకంటారా-కొందరింతే! *

Friday, July 15, 2011

మెగాలీల!

తమాషా కార్నర్

అదృష్టం ఎప్పుడెవరికెలా వరిస్తుందో తెలీదు. సినిమా ఫీల్డులో స్ట్రగుల్ చేస్తున్న సాధారణ జీవులే కాదు, అగ్రస్థానాలకి చేరుకున్న ప్రముఖులూ ఇంకా అదృష్టం కోసం పరితపిస్తూంటారు. అది వరించకపోతే అంతటాప్ పొజిషన్‌లో కూడా విచారపడతారు. మెగాస్టార్ చిరంజీవి పరంగా అదృష్టం కోసం ఎదురుచూస్తున్న టాప్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అసలు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు, అసలుంటుందా లేదా అన్న సస్పెన్సులో కూడా వినాయక్ ఆ అదృష్టం తనకే వరిస్తుందని నమ్మడం, పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్టు సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగిపోయాయ. ఇంతలో ఉరుములేని పిడుగులా వార్త వచ్చి నెత్తిన పడింది. చిరంజీవి 150వ సినిమా పూరీ జగన్నాథ్ ఖాతాలో కెళ్లిపోయింది. అంతేకాదు, 151వ సినిమాకి రామ్‌గోపాల్‌వర్మ అప్పుడే కర్చ్ఫీ వేసేసినట్టుకూడా గుప్పుమంది! మ్యూజికల్ ఛైర్స్ ఆటలో తానొక్కడే వున్నానని నమ్మిన వినాయక్ చూస్తుండగానే, పూరీ దర్జాగా వచ్చి తిష్టవేయడం కంగు తినిపించింది. ఇదంతా మెగాలీల! తలవంచక తప్పదు మరి!!

అడ్వాన్స్ లుక్!
అసలే పైరసీతో సినిమాలు గజగజ వణికిపోతున్నాయి. దీనికి నకిలీ స్టిల్స్ కూడా తోడుగా తయారవుతున్నాయి. నిర్మాతలు సినిమా పూర్తయ్యాక విడుదల చేసే ఫస్ట్‌లుక్ ఫోటోల వరకూ ఇక ఆగనవసరంలేదనీ, సినిమా ప్రారంభించడానికి ముందే అడ్వాన్స్ లుక్ చూపించేస్తామనీ కొందరు ఔత్సాహికులు ఇంటర్నెట్‌లో హడావిడి చేస్తున్నారు. ఫోటోషాప్‌తో షాపింగ్ చూపించేస్తున్నారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇంకా నటించనున్న ‘గబ్బర్‌సింగ్’ స్టిల్స్ సృష్టించి అభిమానులకి అమితానందం కలిగిస్తున్నారు. దీనిపై నిర్మాత గణేష్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇకనైనా అడ్వాన్స్ లుక్ ఔత్సాహికులు తమ ప్రయత్నాలు మానుకుంటారో లేదో తెలీదుగానీ, వాళ్లని అదుపులో పెట్టడానికి పవన్‌కళ్యాణ్ కూడా సరిపోడనిపిస్తోంది. రియల్ గబ్బర్‌సింగ్ గగనతలం నుంచి పాన్ మసాలా తిని వూసి ‘కిత్నే ఆద్మీ థే రేవో?’అని గర్జిస్తే తప్ప, నెట్‌మాటున వెటకారాలు చేస్తున్న ఆద్మీలు పుంజాలు తెంపుకుని పారిపోయేలా లేరు. అప్పుడు వాళ్లకి ఆద్మీలుక్స్ కూడా వుండకపోవచ్చు!

ఫ్రెష్ టైటిల్స్!
ఇక తెలుగు సినిమాల్ని క్రిమికీటకాలు ఏలుకుంటాయ! రకరకాల సింహాలుగా, పులులుగా, నాగులుగా జంతు జలాన్ని కవర్ చేసిన మన స్టార్లు ఈ చరాచర సృష్టిలో క్రిమికీటకాదులపై ఇంట్రస్టు చూపుతున్నారు. దీంతో వారికి ఊసరవెల్లి, ఈగ, కందిరీగ లాంటి జీవులు ప్రాణ ప్రదమవుతున్నాయి. ఇవి గనుక ఫర్వాలేదన్పించే తీరులో పరువు నిలబెడితే మిడుత, జోరీగ, మిణుగురు పురుగు, దోమ, గండుచీమలాంటి టైటిల్స్‌తో ఫారాలు పట్టుకుని పోటాపోటీగా రిజిస్ట్రేషన్లకి పరుగులు తీయవచ్చు. ఇవి కూడా ఐపోతే ఎలా అన్న చింత అక్కర్లేదు. సూక్ష్మజీవులున్నాయి. వైరస్, బాక్టీరియా, అమిబా, హైడ్రా, ఈ-కోలీ లాంటివి మరింత క్రేజ్ సృష్టిస్తాయి. మోడరన్‌గా కూడా వుంటాయి. ఇంకా నేచర్‌ని కొల్లగొట్టడానికి సముద్ర సంపద కూడా వుంది. ఎలాగూ అనె్నం పునె్నం తెలీని చేపలకి, తిమింగలాలకి అవినీతి చేప, అవినీతి తిమింగలం అంటూ పత్రికల్లో రాసేస్తున్నారు కాబట్టి, కేడీ చేప, రౌడీ తిమింగలం, కంత్రీ రొయ్య అనే టైటిల్స్‌ని విప్లవాత్మకంగా సృష్టించుకుని పెట్టుకోవచ్చు. ఇది ఏ జీవహింస చట్టాల కిందికీ రాదు గాక రాదు! *

పెళ్లికి రెడీ..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు ప్రభుదేవా, నయనతారల పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తోంది. వాళ్లిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో వున్నట్లు కోలీవుడ్ సమాచారం. ప్రభుదేవా తమతో వుండేలా చూడాలంటూ భార్య రమలత కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేసింది. అందుకు ఇరు కుటుంబాల నుండి స్పందన లేకపోవడంతో ఇద్దరు ఇష్టపూర్వకంగా విడాకులను పొందేందుకు కోర్టుకు విన్నవించారు. ప్రభుదేవా, రమలత విడాకుల కేసు విచారణకు ఇరువురూ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలరీత్యా హాజరుకాలేమని వారు తమ న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ కేసు వాయిదాపడింది. తన మొదటి భార్య రమలతకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.5 లక్షల రూపాయలను ఇటీవల ప్రభుదేవా చెల్లించారు. అలాగే చెన్నరు అన్నా నగరంలోని ప్లాట్, ఫామ్‌హౌస్, మరో మూడు ప్లాట్‌లను, చెన్నరు ఈసిఆర్ రోడ్డులోని 22 సెంట్ల ప్లాటును హైదరాబాద్‌లోని స్థలంతోపాటు రెండు కార్లను కూడా రమలత తన ఇద్దరు కుమారులు రిషి, ఆదిత్య పేర్లమీద రిజిస్టర్ చేయించారు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చునంతా ఆయనే భరించనున్నారు. మొత్తానికి ప్రభుదేవా నయనతార కోసం ఇవన్నీ వదులుకోవలసి వచ్చింది. ఇది ఇలా వుండగా సినీ నేస్తాలు ఇక సెలవు అంటూ నయనతార గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టింది. ప్రభుదేవా, నయనతార త్వరలో పెళ్లికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో నయనతార నటనకు స్వస్తి పలకనున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రభుదేవాకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుదేవా, నయనతార చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఆయన భార్య రమాలత తీవ్రంగా ఖండించారు. తరువాత ఒక ఒప్పందంతో వివాహ రద్దుకు సమ్మతించారు. కోర్టు త్వరలో వీరి వివాహ రద్దును ప్రకటించనుంది. దీంతో ప్రభుదేవా, నయనతారల పెళ్లికి లైన్ క్లియర్ కానుంది. కాగా వివాహనంతరం సినిమాల్లో నటించకూడదని నయనతారకు ప్రభుదేవా కండిషన్ పెట్టారట. అందుకు ఆమె కూడా సమ్మతించారట. ప్రస్తుతం నయనతార ‘శ్రీరామరాజ్యం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సమయంలోనే నయన కంటతడి పెట్టింది. ఇదే నయన చివరి చిత్రం. బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా ఇందులో నటించారు. ప్రస్తుతం ప్రభుదేవా, నయనతార ముంబయిలో ఉంటున్నారు. వీరి వివాహం కూడా ముంబయిలోనే జరిగే అవకాశం ఉంది. కాగా శ్రీరామరాజ్యం షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన నయనతార ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన అనంతరం యూనిట్ సభ్యులందరినీ కలుసుకుని నమస్కరిస్తూ బాధగా సెలవు తీసుకుంది. *

Monday, July 11, 2011

గాడితప్పిన కథ

-ఎం

* బ్రమ్మిగాడి కథ
తారాగణం:
వరుణ్‌సందేశ్, అస్మితాసూద్
కృష్ణుడు, పూనమ్‌కౌర్
బ్రహ్మానందం, అలీ
నాగినీడు, జయప్రకాష్‌రెడ్డి
శివప్రసాద్ తదితరులు
సంగీతం: కోటి
ఫొటోగ్రఫీ: జవహర్‌రెడ్డి
నిర్మాణం: మల్టీడైమన్షన్స్
ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
నిర్మాత: రజత్ పార్థసారధి
దర్శకత్వం: వి.ఈశ్వర్‌రెడ్డి

కథలో సరైన ట్విస్ట్ లేనప్పుడు దానికి కొన్ని మసాలాలు వేసి పోపుపెట్టడం అవసరమే! అయితే కొన్ని విచిత్రమైన మలుపులున్నప్పుడు స్క్రిప్ట్ పకడ్బందీగా వుండాలి కదా? ఒక పాత్రద్వారా జరగబోయేది కొంచెం సస్పెన్స్‌గా చెప్పుకుంటూ వెళ్లాలి. అయితే సస్పెన్స్ క్రియేటర్ హాస్యగాడైతే...సదరు హాస్యం వర్కవుట్ అవుతుందా, లేక సస్పెన్స్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తారా? అని చూసుకుంటే ఈ చిత్రం పేరు మరోలా ఉండేది. కథలు చెబుతుంటే వినడానికి బానే ఉంటాయి. అయితే కథలో చెబుతున్నట్టుగా మన జీవితాల్లో జరుగుతుంటే ఆసక్తిగానే ఉంటుంది. అటువంటి ఆసక్తిని పెంచడానికి చేసిన ప్రయత్నమే ఈకథ.
శివ (వరుణ్ సందేశ్) గుల్బర్గాలో చదువుకోసం బయలుదేరుతాడు. మధ్యలో తన కోసం ఎదురు చూస్తున్న మామ (జయప్రకాశ్‌రెడ్డి) ఇంటికి వెళ్లవలసి వస్తుంది. అతని ప్రయాణంలో ఆపదలో ఉన్న మాయ (అస్మితాసూద్) తారసపడుతుంది. కొందరు రౌడీలు ఆమెను అంతం చేసే ప్రయత్నంలో ఉంటారు. వారినుండి శివ సాయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మాయ. ఒకవైపు హంతకులు ఈ జంటను వెంబడిస్తుంటే, శివ మామ తరఫు మనుషులు కూడా ఈ జంటను పట్టుకునేందుకు తరుముతుంటారు. ఈ రెండు గ్రూపులకు చిక్కకుండా వారెలా తప్పించుకున్నారు అనేది, అసలు మాయ ఎవరు? ఆమె వెనుక కథేంటి అనేది ఒక ట్రాక్. అయితే ఈ కథంతా సినిమా తీయబోతున్న జయప్రకాశ్‌రెడ్డికి సినీ డైరక్టర్ బ్రహ్మం (బ్రహ్మానందం) తన కథగా చెబుతుంటాడు. ఒక ఫ్రేమ్‌లో బ్రహ్మం కథ చెబితే మరో ఫ్రేమ్‌లో కథలో ఉన్నట్టుగానే శివ ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయాన్ని గుర్తించిన జయప్రకాశ్‌రెడ్డి తన అల్లుడు ఎక్కడికి వెళ్లాడో బ్రహ్మం ద్వారా కనుక్కుంటూ అక్కడికి రౌడీలని పంపించడం తద్వారా మరికొంత హాస్యాన్ని అందించడం మరో ట్రాక్. చివరికి రెండు గ్రూపుల్లో ఏ గ్రూప్‌కి ఈ జంట చిక్కింది అన్నది మిగతా కథ.
గతంలో వచ్చిన ‘ఎ ఫిలిం బై అరవింద్ థ్రిల్లర్‌గా వస్తే, దానికిది కామెడీ వెర్షన్ అనుకోవచ్చు. ఒక్కడు, వసంత కోకిల లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. జరగబోయే సంఘటనలను రచయిత చెప్పడం, అవే సంఘటనలు ఖచ్చితంగా జరగడం, చివరికి హీరో చనిపోతాడని కధలో ఉండడం, తద్వారా సస్పెన్స్‌ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. అలాగే హీరోయిన్ ఆపదలో ఉంటే హీరో రక్షించుకుంటూ వెళ్లడం ‘ఒక్కడు’ చిత్రంలో మనం చూశాం. ఈ ట్రాక్‌ను కూడా హాస్యంగా రూపొందించే ప్రయత్నం చేశారు. వసంత కోకిలలో శ్రీదేవి తన జ్ఞాపకాలను మర్చిపోవడం అనేది మనకు తెలుసు. అయితే చిత్రం క్లైమాక్స్‌లో సదరు జ్ఞాపకాల విషయాన్ని వదిలేసినట్టయింది. కథాపరంగా సస్పెన్స్, హాస్యం, రెండు ట్రాక్‌లు నడిపించే ప్రయత్నం కొంత సఫలమైనట్లే. అయితే కమెడియన్ బ్రహ్మానందం సస్పెన్స్‌తో కథ చెప్పడం తేలిపోయింది. లవ్‌స్టోరీ కాకపోయినా అందులో ఏదో ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కామెడీకి పెద్ద పీట వేసినా, కృష్ణుడు పాత్ర ప్రాధాన్యత లేక వెలవెలపోయింది. హీరో హీరోయిన్‌పై జాలితో ప్రేమించాడా? అసలు హీరోయిన్ తను పూర్తి ఇష్టంతోనే హీరోతో ప్రేమలో పడిందా? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రతి పాత్ర కూడా దానికి తగ్గట్టు ప్రవర్తించక విపరీత ధోరణిలో నటిస్తాయి. హీరో హీరోయిన్లు ఇద్దరూ చిత్రంలో ఎక్కువ భాగం పరిగెత్తుతూనే గడిపారు. ఈ ప్రయాణంలో అనేక పాత్రలు ఎదురవుతాయి. ఆ పాత్రల ద్వారా హాస్యాన్ని పిండే ప్రయత్నం చేసినా అది వృథా అయింది. క్రీడారంగంలో జరిగే మోసాలు, దారుణాలు కొంత చూపించే ప్రయత్నం బాగుంది. అదే రూట్లో మరికొంత కథను చేర్చుకుంటే చిత్రానికి నిండుదనం వచ్చేదేమో!
నటుల్లో వరుణ్‌సందేశ్, అస్మితాసూద్ సరైన నటన కనబరచలేకపోయారు. కొంతలో కొంత బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి కాంబినేషన్ హాస్యాన్ని పండించింది. కృష్ణుడి పాత్ర రొటీన్‌గామారింది. కెమెరా పనితనం డల్‌గా కనిపించింది. హైదరాబాద్‌లో వున్న లొకేషన్లన్నీ చిత్రంలో ఉపయోగించుకున్నారు కానీ కెమెరా క్లారిటీ మిస్ అవడంతో అవన్నీ బాగా కనిపించలేదు. కోటి సంగీతంలో ‘చెప్పలేనిమాట చెప్పుకుంటే’ పాట బాగుంది. ఎడిటింగ్, మాటలు ఫర్వాలేదు. దర్శకత్వపరంగా స్క్రిప్టులో మరికొంత బాగా చేసుకుంటే చిత్రం తీరు మరోలా ఉండేది. మొత్తానికి సాదాసీదా చిత్రంగా ‘బ్రమ్మిగాడి కథ’ మిగిలిపోయింది.

తమాషా కార్నర్

బుక్కయిపోయాను మొర్రో!

టైమ్‌బాగా లేనప్పుడు తగ్గి ఉండాలంటారు. చేతులారా కష్టాలు తెచ్చుకున్నప్పుడు ఇంకా తలొగ్గి ఉండాలంటారు. కానీ మన తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న తమిళ యంగ్ హీరో సిద్ధార్ధ్‌కి ఈ ప్రాప్తకాలజ్ఞత లోపించినట్లుంది. అబ్బాయిగారు అడ్డంగా మాట్లాడేసి కొత్త కష్టాలు తెచ్చుకున్నాడు. ఎంతో అట్టహాసంగా విడుదలైన తన కొత్త సినిమా ‘180’ గురించి ఏదో ఛానెల్ ఏదో వ్యాఖ్యానించిందని ట్విట్టర్‌లో తన మార్కు స్పందనతో తిప్పికొట్టాడు. కొన్ని థర్డ్ గ్రేడ్ ఛానళ్లు గంట కవరేజి కోసం తమ కుటుంబాల్నే అమ్ముకుంటున్నాయనీ, వాళ్ల గాసిప్స్‌కి జవాబివ్వడం టైం వేస్టు అని టైపుకొట్టాడు. ఆ తెల్లారే మీడియా సమావేశం పెట్టాడు. ఆ సమావేశంలో తాను మాట్లాడబోతుండగానే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ లేచి వాకౌట్ చేశారు. దాంతో అవాక్కయిన సిద్ధార్ధుడు చేసేది లేక తను కూడా వెళ్లిపోయాడు. అసలే సినిమా ఫ్లాపయి బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడింది. సినిమాను నమ్ముకున్న వాళ్లందరినీ నట్టేట ముంచింది. ఈ క్లిష్ట పరిస్థితిలో మీడియా సహకారం చాలా అవసరమనుకుంటే తనని అనాధని చేసి వెళ్లిపోయారేమిటి అని జుట్టుపీక్కున్నాడు. ట్విట్టర్‌లో తన టైపింగ్ సరదా ఇంతపని చేస్తుందనుకోలేదు. తమిళనాట తనకి ఆదరణలేక ‘బొమ్మరిల్లు’తో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని సెటిలైన తను, ఈ మధ్య వరసగా ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు సూపర్ ఫ్లాప్స్‌తో దెబ్బతినిపోయి ‘180’మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఈ సినిమా ముసలిదైపోయిన కేన్సర్ కథ! తను కుర్రాడై తనని విపరీతంగా అభిమానించే కుర్రకారుకోసం కాలం చెల్లిన సినిమా తీస్తాడట! హవ్వ! హవ్వ!!

చరిత్ర తెలుసుకోకు,
చెప్పేది చెప్పేయ్!
నిత్యామీనన్ ఇటీవల పలికిన ‘ప్రభాస్ ఎవరు?’ పలుకులు ‘యూ టూ బ్రూటస్?’ అంత పాపులరయ్యాయి కదా, ఇది తను నటించిన ‘180’కి బూస్టప్ ఇవ్వాల్సింది. ఈ సినిమాలో ప్రేక్షకులు తనని విరగబడి చూసేందుకుదోహదం చేసి ఉండాల్సింది. అలా జరగలేదు. ఆమె అన్న మాటల మీద దుమారం రేపి ఆమె పాపులారిటీనిపెంచే మహత్కార్యం చేయలేదు పరిశ్రమ. కానీ పరిశ్రమ ఈమెని గమనిస్తోంది. ఒక సీనియర్ హీరోతో నటించేందుకు నిరాకరించింది. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనేసింది. ఆ సీనియర్ హీరోకి రుచించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభాసెవరో తనకు తెలియదని నోరుజారిందో, అప్పడిక దీన్ని అవకాశంగా తీసుకుని ఆమెని అణచివేసేందుకు సీనియర్ హీరోలు రెడీ అయ్యారని ఫిలింనగర్‌లో గంట మోగింది. ఇదెంత వరకు నిజమో తెలీదుగానీ అసలు నిత్యామీనన్ ఇలా తయారయ్యేందుకు దర్శకుడు జయేంద్రే కారకుడని తేల్చాలి. ఎందుకంటే ‘180’లో నిత్యామీనన్ సిద్ధార్థ్ ఎవరో ఏమిటో ఎక్కడ్నించి వచ్చాడో తెలుసుకోకుండానే ప్రేమించేస్తుంటుంది చివరి వరకూ. కాబట్టి ‘చరిత్ర తెలుసుకోకు చెప్పేది చెప్పేయ్’ అన్న మెంటల్ కండిషన్ జయేంద్రనుంచే సంప్రాప్తించినట్లు భావించాల్సి వస్తోంది!

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేనట్టే!

-ఎం

ఈ మధ్య అందాలతార త్రిష పెళ్లి గురించిన వార్తలు దక్షిణాదిన షికార్లు చేశాయి. ఆమె ఆ వార్తలను చిరునవ్వుతో తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై త్రిష పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ-‘ఈ వార్తలు విని నేనూ ఆశ్చర్యపోయాను. ఎవరు ఇలాంటివి సృష్టిస్తారో నాకు అస్సలు అర్థం కాదు. అయినా తారలపై వచ్చే ఇలాంటి పుకార్లు ఎవరూ పట్టించుకోరు. నా పెళ్లికి అప్పుడే తొందరేం లేదు. తమిళంలో అజిత్‌తో చేస్తున్న ‘మంకత’ నా నలభైయ్యవ సినిమా. యాభై సినిమాలను పూర్తి చేసిన తర్వాత కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే స్థితిలో లేను. ఇంకా పది సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా. నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. నా తరం కథానాయికల్లో ఎవరూ చేయని ఫీట్ చేయాలనేది నా తొలి లక్ష్యం. బాలీవుడ్‌లో నాకు ఎదురైన పరాజయానికి ప్రతిగా..అక్కడ భారీ విజయాన్ని అందుకుని అందరి చేత శభాష్ అనిపించుకోవాలనుంది. ఇది నా రెండవ లక్ష్యం. ఇక పోతే ఇక్కడ కూడా నాకు కొన్ని తీరని కోరికలున్నాయి. అవేటంటే సౌత్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేశాను. ఇటీవలే కమల్‌సార్‌తో కూడా నటించాను. ఇక రజనీసార్‌తో నటించాలి. అలాగే...మణిరత్నం దర్శకత్వంలో ‘యువ’లో నటించాను. కానీ అందులో ముగ్గురు నాయికల్లో నేను ఒకదాన్ని. అలా కాకుండా మణిసార్ దర్శకత్వంలో సోలో హీరోయిన్‌గా చేయాలి. ఇవన్నీ తీరాక, అప్పుడు రిటైర్మెంట్, పెళ్లి గురించి ఆలోచిస్తాను’అంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది చెన్నయ్ చందమామ త్రిష. ప్రస్తుతం త్రిష తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటితో పాటు మరో మూడు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం. సో..మీరప్పుడే త్రిష పెళ్లి గురించి ఏ మాత్రం ఆలోచించకండి.

Friday, June 24, 2011

thamasha corner

తమాషా కార్నర్...

డూప్ బాలయ్య?

నందమూరి బాలకృష్ణేమిటి, డూప్‌గా వేయడమేమిటని అనుకుంటున్నారా? అదే విచిత్రం. మన అగ్రహీరోలు ఇలాంటివి కూడా చేస్తూంటారు. ఏదో సినిమానో, నవలనో కాపీ కొట్టడం కాదు. పోస్టర్లని కూడా కాపీ కొడతారు. పోస్టర్ల మీద వున్న ఇతర స్టార్ల దేహాలకి తమ మొహాలు అతికించుకుని పని కానిచ్చేస్తారు. బాలకృష్ణ నటిస్తున్న ‘హర హర మహాదేవ’ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో పోస్టర్లు దృష్టినాకర్షించాయి. ఒక దాంట్లో బాలయ్య పంచకట్టుతో, ఆచ్ఛాదనలేని ఛాతితో పిడికిళ్లు బిగించి రౌద్రావేశంతో ఉంటాడు. మరొక దాంట్లో గుర్రంమీద ఖడ్గమెత్తి వీరావేశంతో ఉంటాడు. ఈ పోస్టర్లు అదరగొట్టాయి. సినిమా ప్రారంభోత్సవానికి బాలయ్య భలే ఫోటో షూట్ చేశాడే అన్పించాయి. కానీ...కానీ. కాస్త జాగ్రత్తగా చూస్తే...ఇది ఫోటో షూట్ కాదు, ఫోటోషాప్ అని తేలిపోయింది. ‘దశావతారం’లో కమలహాసన్ ఫోజుకి బాలయ్య ఫేసు, ‘్ఫసిరాజా’లో మమ్ముట్టి బాడీకి బాలయ్య ఫేసే! ఏమి విచిత్రం...ఏమి విచిత్రం...ఇటులనూ పోస్టర్లు ముద్రింతురా? తెలుగు ప్రేక్షకులు అమాయకులని భావించుకుని ఇటులనే చేసెదరు! హర హర మహాదేవ!!

ముడిఫిల్మో నారాయణ!

ఇటీవల విడుదలైన ఓ మెగా మూవీ కోసం నాలుగు లక్షల అడుగుల ముడి ఫిలిం ఎక్స్‌పోజ్ చేశారట. ఇందులో ఆశ్చర్యమేముంది, 10-20 కోట్ల సినిమాలకే 3 లక్షల అడుగుల ముడి ఫిలిం వాడుతున్నారు కదా అనొచ్చు. ఇక్కడే పప్పులో కాలేశారు. లేదా రీళ్ల చుట్టలో లెగ్గేశారు. అసలు విషయమేమంటే ఈ 40 కోట్ల బడ్జెట్‌తో తీసామని చెప్పుకుంటున్న భారీ చిత్రరాజం మొత్తానికీ 4 లక్షల అడుగుల ముడి ఫిలిం హాంఫట్ కాలేదు. అందులో ఒక యాక్షన్ సీనుకు మాత్రమే అయిందన్న మాట. ప్రముఖ యాక్షన్ డైరక్టర్ 4 నిముషాలుండే ఆ పోరాట సన్నివేశానికి ఎడాపెడా క్యాన్లు ఎక్స్‌పోజ్ చేయించేశాడట. ఆ నాలుగు లక్షల అడుగుల్ని ఒక ప్రముఖ స్టుడియోలోని ల్యాబ్‌లో ప్రాసెస్ చేసేసరికి తలప్రాణం తోకకొచ్చిందట. ఇక ఎడిటింగ్ సూట్‌లో సంగతి చెప్పేదేముంది? పనికిరాని షాట్స్ అన్నీ తీసేసి 400 అడుగులకి (4 నిముషాలు) కుదించేసరికి దేవుడు దిగివచ్చాడట. మిగిలిన మూడు లక్షల 99 వేల 600 అడుగుల ఫిలింని చెత్తబుట్టల పారేసి హమ్మయ్య అనుకున్నారుట. మరి బిగ్ బడ్జెట్ సినిమా అనే పేరెలా వస్తుందనుకున్నారు? అంటే ఆ మేరకు 999 క్యాన్లు అన్నమాట. 999తి12000 రూపాయలు= 1 కోటి 19 లక్షల 88వేల రూపాయలు. ఒక్క ఫైట్ సీనుకి గంగపాలు అన్నమాట!

సల్మాన్ రవితేజఖాన్!

అదేమిటోగానీ రవితేజ సినిమాలు సల్మాన్‌ఖాన్ సొంతం చేసుకుంటున్నాడు. రవితేజ బాలీవుడ్ నిర్మాతలకి రీమేకుల రాజా అన్పించుకుంటున్నాడు. ఆంధ్రాలో మాస్ మహారాజా అనే పేరుంది సరేసరి, తన రీమేక్స్‌కి సల్మానే సూట్ కావడం ఇక్కడ విశేషం. కిక్, డాన్‌శీను, మిరపకాయ్ సినిమాలు మూడూ సల్మాన్ సొంతమై బాలీవుడ్‌లో సల్మాన్ రూపంలో రవితేజ తన రఫ్ యాక్టింగ్‌ని ప్రదర్శించబోతున్నాడు. దీంతో ఇద్దరికీ ఒక సర్వనామం స్థిరపడుతోంది. సల్మాన్ రవితేజ ఖాన్ అని! ఈ టాలీ-బాలీ- తాలింపువుడ్ ఇంకెన్ని రుచులు వడ్డిస్తుందో చూద్దాం!

Friday, May 20, 2011

సీమ టపా కాయ్ సినిమా సమీక్ష

  • డ్రామాలెక్కువ... కామెడీ తక్కువ!
  • -ఎం.డి
  • May 20th, 2011

  • ** సీమటపాకాయ్ (ఫర్వాలేదు)
  • తారాగణం:
  • అల్లరి నరేష్, పూర్ణ, షాయాజీషిండే, నాగినీడు
  • బ్రహ్మానందం, వెనె్నల కిషోర్, ఎల్.బి.శ్రీరామ్
  • జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ
  • సుధ తదితరులు.
  • కెమెరా: అడుసుమిల్లి విజయకుమార్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాత: మళ్ల విజయప్రసాద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
  • జి.నాగేశ్వరరెడ్డి

  • ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయేమో కానీ, నీతులు చెప్పేటందుకు మాత్రం సినిమాలు లేవు. ఇటు సందడిని, అటు సందేశాన్ని రెండూ ఇమడ్చడం అంటే కాస్త కత్తిమీద సామే. అందునా లాజిక్‌లు అస్సలు పనికిరాని కామెడీ సినిమాలకు ఈ సందేశపు వ్యవహారాలు అస్సలు అతకవు. ఇలా రెండు పడవలపై ప్రయాణించడానికి ప్రయత్నించిన వ్యవహారమే ‘సీమటపాకాయ్’.

  • బాగా డబ్బుచేసిన కుటుంబం షాయాజీషిండేది. అతడి పుత్రరత్నం నరేష్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి పూర్ణకు డబ్బున్నవాళ్లంటే అస్సలు సరిపడదు. దీంతో అతడు తను కటికపేదగా నటిస్తాడు. తను నటించడమే కాదు..ఇంట్లో వాళ్లని కూడా తన ప్రేమ కోసం పేదవారిగా నటింపచేస్తాడు. తీరా చేస్తే..ఆ అమ్మడు కాస్తా ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీ పిల్ల. ఆమె తండ్రి నాగినీడు అరివీర ఫ్యాక్షనిస్టు. ఇక్కడ కథ రివర్సవుతుంది. పిల్లపై అభిమానంతో నాగినీడు అండ్ కో మంచి బుద్ధిమంతులైన వారిలా నటించడం ప్రారంభిస్తారు. ఇలా ఇటో ఫ్యామిలీ..అటో ఫ్యామిలీ..ఎవరికి వారు డ్రామాలాడుతుంటే, విలన్ జయప్రకాష్ రెడ్డి రంగప్రవేశం చేస్తాడు. దీంతో హీరో అతడ్ని కూడా సంస్కరించడానికి మరో డ్రామా ప్రారంభిస్తాడు. ఇలా ముచ్చటైన మూడుడ్రామాలతో సినిమా నడుస్తుంది.
  • డబ్బున్న హీరో, డబ్బులేని హీరోయిన్ నడుమ ప్రేమకథలు చాలా వచ్చాయి..కానీ ఈ కథని కాస్త విభిన్నంగానే అల్లుకున్నారు. ప్రేమ కోసం హీరోనో, హీరోయినో కాకుండా, వారి కుటుంబసభ్యులంతా నాటకాలాడడం కొంచెం కొత్త. దీనికి ఫ్యాక్షను కథను ముడిపెట్టడం వరకు బాగానే వుంది. కానీ ఒక పక్క కామెడీ సీను వస్తే, పడి పడి నవ్వినవారు, ఆ వెంటనే ‘్ధర్మసంస్థాపనార్థాయ’ అంటూ సుద్దులు చెప్పడం ప్రారంభిస్తే, పరవాణ్ణం తింటుంటే పంటికింద రాయి వచ్చిన చందాన గిలగిలలాడతారు. పైగా మరోపక్క ఈ కథలో సాగే డ్రామాలన్నీ మరీ పేదరికం త్రీడీలో కనిపించే లెవెల్. ఇదీ చూడ్డానికి కొంచెం ఇబ్బందే. వీటిని కాస్త ట్రిమ్ చేసుకుని వుంటే కామెడీ పర్సంటేజి పెరిగినట్లుండేది. అలాగే సినిమా అయిపోయింది అనుకున్న తరుణంలో జయప్రకాష్ సంస్కరణ ఉద్యమం ప్రారంభమై సినిమా సాగిందన్న ఫీలింగ్ కలిగింది. ఇది తప్పనిసరి అనుకున్నపుడు హీరో కుటుంబ వ్యవహారాలను హీరోయిన్ తండ్రి పరిశీలించే కార్యక్రమాన్ని తగ్గించుకుని వుంటే బాగుండేది. ఈ పంటి కింద రాళ్లను పక్కన పెడితే సినిమాలో కామెడీ సన్నివేశాలన్నీ బాగున్నాయి. క్లయిమాక్స్‌లో రీమిక్స్ మిక్చర్ సాంగ్ ఇవీవీ స్టయిల్‌ను మరోసారి గుర్తుచేసింది.
  • నటీనటులందరూ ఓకె. నరేష్ వేయాల్సినన్ని వేషాలు వేసాడు. మిగిలిన హీరోలకన్నా నేనేమన్నా ఓ ముద్దు తక్కువ తిన్నానా అన్నట్లు, నరేష్ కూడా లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం హీరోయన్ పెదాలను అలా అలా సుతారంగా టచ్ చేసేసాడు. కొత్త అమ్మాయి పూర్ణ హుషారుగానే చేసింది కానీ, మరీ సామ్యవాద డైలాగుల్లో మాత్రం నాటకాలను గుర్తుకుతెచ్చింది. టెక్నికల్ వ్యవహారాల్లో వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సినిమాకు కాస్త మైనస్సే. పాటలేవీ సినిమాలోనైనా పట్టేటట్లుగా లేవు. ర్యాప్ స్టయిల్ పెద్దగా నప్పలేదు. మరుదూరి రాజా డైలాగులు అక్కడక్కడ పేలాయ..్ఫటోగ్రఫీ స్టయల్ ఒక్కోసారి డబ్భై, ఎనభై దశకాల సినిమాలను గుర్తుకు తెచ్చింది. టైటిల్స్ వెరైటీ అని దర్శకుడు అనుకుని వుండొచ్చు కానీ, అలా అనిపించలేదు. మొత్తం మీద సినిమా వేసవి సెలవుల్లో కాస్తలో కాస్త రిలీఫ్‌గానే వుంటుంది.. అన్నింటికి మించి కామెడీ ఛానెళ్లకు బిట్లు వేసుకోవడానికి మాత్రం బాగా పనికివస్తుంది.

Sunday, March 27, 2011

జై భోలో తెలంగాణా

తెలంగాణ బతుకుచిత్రం!
February 10th, 2011
*** జై బోలో తెలంగాణ (బాగుంది)
తారాగణం: జగపతిబాబు, స్మృతీఇరానీ సందీప్,
మీరానందన్, గౌరీశంకర్, వేదకుమార్, శివారెడ్డి
దేశపతి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య , డా.శ్రవణ్ తదితరులు.
కెమెరా: టి.సురేందర్‌రెడ్డి
సంగీతం: చక్రి
నిర్మాణం: మహాలక్ష్మి ఆర్ట్స్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్
ఉద్యమాల పురిటిగడ్డలో ఉరకలెత్తే ఉత్సాహంతో సరికొత్తగా వచ్చిన ప్రజా ఉప్పెన ప్రత్యేక తెలంగాణ పోరాటం. గత దశాబ్దంగా ప్రజావాణితో బాటు, రాజకీయ సంక్షోభాలకు కారణమైన ఉద్యమ తీవ్రత గూర్చి వివరిస్తూ, తెలంగాణా కళాకారుల మమేకంతో జన ప్రవాహంలా సాగిన జనజీవిత వ్యవస్థను అద్దంలో చూపే ప్రయత్నం ఎన్నదగినదే. అయితే ప్రజా నాయకులు రాజకీయ యవనికపై ఈ ఉద్దృత పోరాటానికి ఎంతమంది బావుటాలెత్తారు? వారి ఉద్యమ ప్రస్థానం ఎలా సాగిందీ? అందులో కష్టనష్టాలు, ఒడిదుడుకులు, ఒక ప్రాంతం విడిపోతే ఎవరికి ఖేదం? మరెవరికి మోదం అన్న ప్రశ్నలు వేస్తూ, వాటికి జవాబులు కూడా ఎవరికి వారు చెప్పుకునే స్క్రీన్‌ప్లేతో ‘జై బోలో తెలంగాణ’ చిత్రం ఆసాంతం సాగుతుంది.
‘‘తెలంగాణాలో పుట్టిన ఓ బిడ్డగా నా బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. చరిత్రలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఉత్తేజం, ఉద్వేగం నాలో కలుగుతోంది’’ అని దర్శకుడు ఎన్.శంకర్ తను రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం గురించి ఇన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ మాటల్లో ఉన్న ఉద్వేగం, బాధ్యత చిత్రంలో ఎంతవరకు ప్రతిబింబించింది. ఎంతవరకూ ప్రతి ఫలించిందీ అంటే థియేటర్లలో డైలాగులకు, పాటలకు వస్తున్న స్పందనంత.
కథలోకెళితే...బందగీ గోపన్న (జగపతిబాబు) కుటుంబం అనేక తరాలుగా తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతూ, నిజాం దొరల ఏలుబడిలో జరిగిన మానవ వనరుల దోపిడీని ప్రశ్నిస్తూ, సంఘానికి బాట చూపేవారు. ఆ క్రమంలో గోపన్న ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రజా ఉద్యమాలు లేవదీసి పోరాడి పోలీసు కాల్పుల్లో అమరుడవుతాడు. అతని భార్య జయమ్మ (స్మృతిఇరానీ) ‘అమ్మఒడి’ అనే ఆశ్రమం స్థాపించి అన్నార్తులకు, అభాగ్యులకు ఆసరాగా ఉంటుంది. జయమ్మ కొడుకు వర్షిత్ (సందీప్)కు తండ్రి, తాతల్లాగే ఆశయం కోసం మరణించడం ఇష్టముండదు. మంచి చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడిపోవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతడికి విజయవాడ నుంచి ఉద్యోగం నిమిత్తం వచ్చిన సహజ (మీరానందన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. తెలంగాణ అబ్బాయి, సీమాంధ్ర అమ్మాయి మధ్య ప్రేమ అంకురించడం వల్ల వర్షిత్ తన ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తాడు. అప్పటికే వర్తమాన తెలంగాణ పోరాట చిత్రం దేశ పటంపై సాగుతుంటుంది. ఈ నేపథ్యంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వర్షిత్‌కు తెలంగాణ పల్లె జనం పడుతున్న కష్టాలు, కన్నీళ్లు తెలిసి వస్తాయి. దాంతో తన ప్రేమను పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకుతాడు. ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ జంట ఒకటయ్యారా...ఉద్యమం వారికి ఏమి మిగిల్చింది అనేదే అసలైన క్లైమాక్స్.
సినిమా అంటేనే కొంత కల్పన ఉండాలి. ఉన్నదున్నట్లు చెబితే అది సినిమాటిక్‌గా ఉండదనుకున్నారో ఏమో, ఉద్యమ కథకు ప్రేమకథను ముడిపెట్టారు. కథగా చూస్తే ఇది రొటీన్ ప్రేమకథే. అయితే దర్శకుడు శంకర్ ప్రతిభ అంతా ప్రేమకథని ఉద్యమానికి ముడివెయ్యటంలోనే చూపెట్టాడు. ఉస్మానియా యూనివర్శిటీ కాల్పుల ఘటన, తెలంగాణ కోసం తొలిసారి అమరుడైన శ్రీకాంత్‌చారి మరణం, కెసీఆర్ నిరాహారదీక్ష, తర్వాతి పరిణామాలు, ముఖ్యంగా డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన, తెలంగాణా నేతల పాత్రలు కూడా కథలో మిళితమవడంతో చిత్రం క్లారిటీగా వచ్చింది. నెగెటివ్‌గా చూపెట్టిన తెలంగాణేతర ప్రాంత పాత్రలు కూడా కథలో మిళితమై కథకు నిండుతనం తెచ్చిపెట్టాయి. జానపదబాణీతో గద్దర్ పాట చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుంది. అలాగే ‘జై బోలో తెలంగాణ’ అని టైటిల్‌పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఏక పక్షంగా ఉద్యమాన్ని చూపెడతారని అంతా భావించారు. అదే జరిగింది. కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందే లేదు. వాస్తవంగా జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ చక్కని కూర్పుతో అల్లడం వల్ల ప్రేమకథ ఫ్లేవర్‌ను కొంత తగ్గించే ప్రయత్నమూ చేసారు. అయతే చరిత్రను సినిమాగా రూపొందించడంలో వాస్తవాల్ని ప్రజల ముందుంచడంలో దర్శకుడు మరికొంత కసరత్తు చేయాల్సింది. బందగీ గోపన్న వంటి అమరుడి గురించి చెప్పినా, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరుగుతోందన్నది మరింత లోతుగా చెబితే బావుండేది. ఏవీఎస్, జనార్ధన్ మహర్షి కామెడీ ట్రాక్ నవ్వులు కురిపించింది. అక్కడక్కడ కె.సి.ఆర్‌ను చూపి ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగించారు. తెలంగాణ సంస్కృతిని, ఉద్యమాన్ని అగ్రభాగాన నిలుపుతూ, ప్రజల మనోభీష్టాలకు అద్దం పట్టిన ఈ చిత్రాన్ని తెలంగాణా అభిమానులకేకాక, అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు శంకర్ తను అనుకున్నది సాధించినట్లయింది.
నటుల్లో ప్రధాన పాత్ర వేసిన జగపతిబాబు కనిపించింది కొద్ది సమయమైనా, తన ముద్ర వేయగలిగాడు. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానికన్నా, ఈ సినిమాకి మాత్రం జగపతిబాబు కచ్చితంగా వెనె్నముకలా నిలబడ్డారనేది నిజం. సందీప్, మీరానందన్, స్మృతీఇరానీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గద్దర్ ఒక్క పాటైనా చిత్రం ముగింపు వరకు వెన్నాడేట్లు కనిపించి ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగించాడు. చిత్రంలోని కొన్ని ఫ్రేమ్‌లు గత కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు గుర్తుకు వచ్చి కళ్లు చెమర్చేలా చేస్తాయి.
చక్రి సంగీతంలోని పాటలన్నీ బాగా కుదిరాయి. పాటలు రాసింది ఉద్ధండులైన ప్రజాకవులు కావడంతో పాటల్లో మాటలు తూటాల్లా పేలాయ. ముఖ్యంగా అందెశ్రీ రాసిన ‘జైబోలో తెలంగాణ’, నందిని సిద్ధారెడ్డి ‘ఒక పువ్వు ఒక నువ్వు ఉయ్యాల లూగేనా...’, గద్దర్ రచించి ఆడి పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...పోరు తెలం గాణమా..కోట్లాది ప్రాణమా..’ బాగా ఆకట్టుకున్నాయ. వీరికి తోడు కెసిఆర్ రాసిన ‘జగారడీ చేస్తుండ్రు..గడిబిడి చేస్తుండ్రు..’ పాట ఆయన స్టయల్‌లోనే సాగింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ‘తెలంగాణ కోసం ఎన్ని స్విచ్‌లు నొక్కినా ఫలితం లేదు. ఢిల్లీలో కరెంట్ లేదుగా’, ‘కలిసి ఉందా మనుకున్న మమ్మల్ని విడదీస్తున్నారు... విడిపోతాం అంటున్న తెలంగాణాను మాత్రం కలిసి ఉండాలంటు న్నారు. ఇదేం న్యాయం?’ లాంటి డైలాగులకు ప్రేక్షకుల్లో ఈలలే ఈలలు. చప్పట్లే..చప్పట్లు మొత్తానికి దర్శకుడు ఎన్.శంకర్ తాను ఎందుకోసం ఈ చిత్రం తీసాడో, ఆ ధ్యేయం నెరవేరినట్లే.
-md abdul

అలా కొత్త నీరు మొదలైంది

అలా... కొత్తనీరు మొదలైంది!
-ఎం.డి.అబ్దుల్
March 10th, 2011

‘తుపాను రాలేదు...కనీసం చిరు జల్లులు కూడా పడలేదు...కానీ కొత్తనీరు పరవళ్లు తొక్కుతూ అందరినీ పరవశింపచేస్తూ వచ్చేసింది’ అయితే అది నదుల్లోకి కాదు... తెలుగు సినీ పరిశ్రమలోకి. కొత్త ఆలోచనలతో..సరికొత్త కథాంశాలతో...నిశ్శబ్దంగా మొదలుపెట్టి అణు విస్ఫోటనం కావించే రీతిలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు కొత్త దర్శకులు. తమదైన కొత్త శైలితో సరికొత్త సినిమాను తెలుగు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అయితే వీరిలో కొందరు కానె్సప్ట్‌పరంగా నవ్యత చూపించినా తెలుగు ప్రేక్షకుడి నాడిని పట్టుకోలేక బోల్తాపడ్డారు. మరికొందరు మాత్రం అటు విమర్శకుల ప్రశంసలను పొందడమే కాక బాక్సాఫీసుకు కలెక్షన్లతో విందుభోజనం పెట్టి విజయకేతనం ఎగరేశారు. వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న తెలుగు సినిమాను కొద్దో గొప్పో రక్షించే ప్రయత్నం చేసిన వీరి విజయానికి దోహదం చేసిన అంశాలేమిటి...ఎక్కడుంది వీరి సక్సెస్ సూత్రం...అనేది పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు కళ్లెదుట ప్రత్యక్ష మవుతాయి.

ఓ సీనియర్ అసోసియేట్ దర్శకుని దగ్గరకు ఒక కొత్త నిర్మాత వచ్చాడు. రెండు..రెండున్నర కోట్లతో ఓ సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టాడు. అయితే ఆ అసోసియేట్ దర్శకుడుకి ఆ నిర్మాత కొద్దిగా కూడా ఆనలేదు. ఆ నిర్మాత చెప్పిన బడ్జెట్ మొత్తం తన హీరో పారితోషికంలో సగం కూడా లేదని పొమ్మని, తన కొత్త ఫైల్‌లో పాత కథను పట్టుకుని హీరోకి కథ వినిపించడానికి బయలుదేరాడు. సినిమా అంటే మినిమం ఎంత లేదన్నా పదిహేను నుంచి ఇరవై కోట్లు ఉండాలనేది అతను తను అప్రెంటీస్‌గా పనిచేసినప్పటినుంచీ నేర్చుకున్న పాఠం. అయితే తన గురువు కూడా మొదట చిన్న సినిమాతోనే కెరీర్ మొదలుపెట్టి తర్వాత పెద్ద దర్శకుడు అయ్యాడన్న సంగతి మరిచిపోయాడు. కెరీర్ మొదట్లోనే రాజవౌళికి పోటీ ఇవ్వాలి, వి.వి.వినాయక్‌ని పడగొట్టాలి, ఎన్‌టిఆర్‌తోనో, ప్రభాస్‌తోనో సినిమా చేయాలనేది అతని జీవితాశయం. తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి తోడుగా ‘ఆస్కార్’ రెహమాన్ లాంటి పెద్ద సంగీత దర్శకుడు, శ్రీకర్ ప్రసాద్ లాంటి ఎడిటర్, పి.సి.శ్రీరామ్ లాంటి కెమెరామెన్ ఉండాలని కోరిక. అంతేకానీ తనలాగే కొత్తగా ట్రై చేస్తున్న వారు పొరపాటున కూడా తన సినిమాకు పనికిరారని ఫిక్సయి కలల్లో తేలుతూ ఖాళీగా తిరుగుతుంటాడు. ఈ అందమైన ఊహని బ్రేక్ చేసి కాస్త వాస్తవంలోకి వచ్చి స్క్రిప్టుని, తమని మాత్రమే నమ్ముకుని రంగంలోకి దూకినవారే విజేతలుగా నిలిచారు. ఆ విజేతలే తమ తదుపరి సినిమాకు ఆ అసోసియేట్ దర్శకుడు అనుకున్న పెద్ద ఛాన్స్ ( పెద్దహీరో, పెద్ద బ్యానర్, పెద్ద బడ్జెట్)లను వరిస్తున్నారు.
క్రితం సంవత్సరం నవంబర్‌లో వచ్చిన ‘ఏమైంది ఈ వేళ’ దర్శకుడు సంపత్ నంది విషయాన్ని తీసుకుంటే...అతను అప్పటికి వరస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ సందేశ్ హీరోగా సినిమా తీసారు. ఓపెనింగ్స్ కూడా కష్టమనుకునే స్థితిలో విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజులకే అందరి దృష్టినీ ఆకర్షించి మంచి విజయాన్ని సాధించింది. అమీర్‌పేట సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ చిత్రం వారి మనస్సులను గెలిచింది. యువత మనస్సులోని కన్ఫూజన్‌ని క్లారిటీగా వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో చెప్పినందుకు ఈ విజయం దక్కింది. విడుదలైన రెండు వారాలకే ప్రింట్ల సంఖ్య రెట్టింపు చేసుకుని నమ్మి అవకాశమిచ్చిన ప్రొడ్యూసర్‌ని ఆర్థికంగాను ఆనందపరచగలిగింది. అంతేకాక ఆ దర్శకుడికి రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అద్భుతమైన ఛాన్స్‌ని తెచ్చిపెట్టింది. ఇది కేవలం బడ్జెట్ పరిమితుల్లో హిట్ సినిమా తీయగలిగే నైపుణ్యానికి దక్కిన బహుమానం. ఇక సంక్రాంతి సీజన్ అనంతరం విడుదలై...ఘనవిజయం సాధించిన మరో చిన్న బడ్జెట్ చిత్రం ‘అలా మొదలైంది’. ఈ సంవత్సరం డీసెంట్ హిట్‌గా చెప్పబడుతున్న ఈ చిత్రం ఓ మహిళా దర్శకురాలు (నందినీరెడ్డి) వెండితెరపై ఆవిష్కరించిన కొత్త తరహా రొమాంటిక్ కామెడీ. ‘అష్టాచెమ్మా’ తర్వాత ఒక్క హిట్టు కూడా లేని నానిని హీరోగాపెట్టి కొత్తమ్మాయి నిత్యామీనన్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం..సినిమా విజయవంతం కావాలంటే కావాల్సింది పెద్దబడ్జెట్, క్రేజీ కాంబినేషన్ కాదని కేవలం కథా, కథనాల్లో కొత్తదనం, దానిని తెరకెక్కించే తీరులో వైవిధ్యం ఉంటే చాలని నిరూపించింది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు అంతరించిపోతున్న తరుణంలో వారి ఉనికిని నిలబెట్టగలిగింది. అందులోను మహిళా దర్శకుల సినిమాలంటే కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్, రీమేక్‌లనే కాకుండా యువతరం ఆనందించగలిగే సినిమాలు కూడా రూపొందించగలరని నిరూపించింది. అంతేకాక రొమాంటిక్ కామెడీల వైపు పరిశ్రమ దృష్టిని మరల్చేలా చేసింది. ఈ సినిమా విజయం ఆమెకు బెల్లంకొండ సురేష్‌లాంటి పెద్ద నిర్మాతతో సినిమా ఆఫర్‌ని తెచ్చిపెట్టేలా చేసింది. సమంత, సిద్ధార్ధ కాంబినేషన్‌లో ఆమె తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టింది. చిన్న సినిమాతో మొదలుపెట్టిన ఆమె ప్రస్థానం రెండో అడుగుకే పెద్ద సినిమావైపుకు మరలింది. ఎల్.బి.డబ్ల్యు (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) అంటూ టైటిల్‌లోనే వైవిధ్యం చూపిస్తూ మనముందుకొచ్చిన మరో దర్శకుడు ప్రవీణ్ సత్తార్. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకున్నా, పరిశ్రమలో పెద్దల దృష్టిని ఆకర్షించింది. కళ్లెం లేని గుర్రాల్లాంటి యువకుల మనస్సులను ప్రతిబింబిస్తూ...వారి స్నేహాలు, ఆకర్షణలూ, ప్రేమలూ సఫలం అయినా కాకున్నా మంచి అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయా చెప్పిన ఈ చిత్రం ఓ వర్గాన్ని బాగానే ఆకర్షించింది. తెలుగులోను మల్టీఫ్లెక్స్ సినిమాకు ఓ ఊపుని తెచ్చే ప్రయత్నం చేసిందీ చిత్రం. బెల్లంకొండ సురేష్ లాంటి అనుభవం ఉన్న పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుని తాను స్వంతంగా ప్రింట్లు పెంచుతానని ప్రకటించడమే ఈ చిత్రదర్శకుడు సాధించిన విజయమని చెప్పాలి. సృజనాత్మకతే నిజమైన పెట్టుబడి అని నిరూపించిన ఈ దర్శకుడు నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనడంలో సందేహం లేదు.
‘అహనా పెళ్లంట’ అంటూ పాత టైటిల్‌తో వచ్చిన నూతన దర్శకుడు వీరభద్రమ్. పాతికేళ్ల లోపు వాళ్లే సినిమా ప్రేక్షకులు అని నమ్మకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం చేసి సఫలీకృతుడయ్యాడు. ‘అల్లరి’ నరేష్‌తో రెగ్యులర్ కామెడీ కాకుండా లవ్‌స్టోరీని కూడా మిక్స్‌చేసి నవ్విస్తూనే ఆహ్లాపరచగలిగాడు. అనుభవం, పరిచయాలు చాలా ఉన్నా తన మొదటి సినిమాకు ఏ పెద్ద హీరోనో అనుకోకుండా కేవలం తన టాలెంట్ మీద నమ్మకంతోనే అల్లరి నరేష్‌తో చిన్న సినిమా తీసి విజయం సాధించి తన గురువు ఇవివి సత్యనారాయణకు తన తొలి చిత్రాన్ని అంకితమిచ్చి ఆయన ఆశీస్సులు అందుకోగలిగాడు. ఇప్పుడు వీరభద్రమ్ ఓ పెద్ద హీరోతో తన తదుపరి చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇక రీసెంట్‌గా పరిచయమైన మరికొంతమంది కొత్త దర్శకులు (కుదిరితే కప్పు కాఫీ, ఖర్మ వంటి చిత్రాలు) విజయవంతం కాకపోయినా తమదైన శైలిని, కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించారు. వారిలోని తపనను బయటపెట్టగలిగారు. వీరు భవిష్యత్తులో గ్యారంటీగా మంచి చిత్రాలు తీసే అవకాశముందని నమ్మకం కలిగించారు.
ఇదిలావుంటే పెద్ద బడ్జెట్‌లతో, క్రేజీ కాంబినేషన్లతో పరిచయమైన కొత్త దర్శకులు ప్రకాష్ కోవెలమూడి (అనగనగా ఒక ధీరుడు), బి.వి.ఎస్.రవి (గోపీచంద్ వాంటెడ్) మన ముందుకు వచ్చి చతికిలపడ్డారు. వీరి సినిమాలు భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్‌లు అంటూ కేవలం ప్రచార ఆర్భాటాలతో ఓపెనింగ్స్ రాబట్టగలిగినా కథ, కథనాలు సరిగ్గా లేక విజయం అందుకోలేకపోయారు.
కొత్తగా పరిచయమవ్వాలనుకునే దర్శకులు పెద్దబడ్జెట్, పెద్ద హీరోలే కావాలని పట్టుపట్టకుండా తమలోని సృజనాత్మకతను తెలియపరచడానికి చిన్న బడ్జెట్ చిత్రాన్నైనా చేసి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే వారు కోరుకున్న బ్యానర్స్, హీరోలు వారి దగ్గరకు వస్తారనేది పైన చెప్పుకున్న దర్శకులు నిరూపించిన సత్యం. అలాగే చిన్న సినిమావల్ల పరిశ్రమ సంక్షోభంనుంచి తప్పించుకుంటుంది. పరిశ్రమలో అందరికీ పని దొరుకుతుంది.
ఇక ఇప్పటికే నిరూపించుకున్న కొత్త దర్శకులు వారి కొత్తదనాన్ని, సృజనను కేవలం మొదటి చిత్రానికే పరిమితం చేయకుండా ప్రతి చిత్రంలోను ప్రదర్శిస్తారని కోరుకుందాం.
గమనిక: పైదంతా చదివి చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమాలన్నీ కొత్త ఆలోచనలతో ఉంటాయనుకుంటే సూపులో కాలు వేసినట్టే... *