Friday, July 18, 2014

ఫ్యామిలీ డ్రామా!
18/07/2014-ఎం.డి.అబ్దుల్
** దృశ్యం (ఫర్వాలేదు)
తారాగణం:
వెంకటేష్, మీనా, నదియా
సమీర్, నరేష్, రవికాలే
పరుచూరి వెంకటేశ్వరరావు
కృతిక తదితరులు
-----------
సంగీతం: ఎస్.శరత్
మాటలు: డార్లింగ్ స్వామి
కథ, స్క్రీన్‌ప్లే: జీతు జోసెఫ్
ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి
నిర్మాతలు: రాజ్‌కుమార్ సేతుపతి, సురేష్
దర్శకత్వం: శ్రీప్రియ
================
మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘దృశ్యం. చాన్నాళ్లుగా రీమేక్ కథల పట్ల ఆసక్తి కనబరిచే వెంకటేష్ ఈ సినిమా చేయనున్నట్టు వార్తలు రావటంతో సహజంగానే అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు పొడసూపాయి. మలయాళంలో ‘మోహన్‌లాల్’ ఈ కథకి జీవం పోశాడు?! మరి ఆ పాత్రలో వెంకటేష్ ఎలా ఉంటాడో? కథ ఏమిటో? ఇత్యాది ప్రశ్నలతో ఎదురుచూసిన ‘దృశ్యం’ రావటమే కాదు... కడు రమణీయంగా.. అదొక మరపురాని దృశ్యంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ మధ్యకాలంలో వస్తూన్న సినిమాల్లో ‘కథ’ లేకపోవటం చూస్తున్నదే. అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయించక మానదు. స్టార్ ఇమేజ్‌లూ చట్రాలంటూ - స్టార్ హీరో కాల్షీట్ దొరికిందే భాగ్యమన్నట్టుగానూ - ఆ హీరోకి తగ్గ కథ అంటూ లేనిపోని ‘రేంజ్’లను సృష్టించటం.. గత చరిత్రల్ని తిరగేయటం... పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాల తాలూకు డైలాగ్స్‌తో పేజీల్ని నింపటంతో - ఇటు ప్రేక్షకులు అటు అభిమానులు ఒక్కో సందర్భంలో అసందిగ్ధ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు కూడా. ఈ సందిగ్ధావస్థలో ‘దృశ్యం’పై అనేకానేక అనుమానాలూ వచ్చాయి. మలయాళ కథ తెలుగు నెటివిటీకి సరిపోతుందా? తెలుగు హీరో ‘ఇద్దరు పిల్లల తండ్రి’గా నటిస్తే చూస్తారా? ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడతారా? అంటే- కథని తీసే రీతిలో తీస్తే.. కచ్చితంగా అందమైన ‘దృశ్యం’ కనిపిస్తుంది.
రాంబాబు (వెంకటేష్) అనాధ. స్వయంకృషితో జీవితంలో ఒక స్థాయికి చేరుకుంటాడు. మధ్యతరగతి దోబూచులాటలతో నిత్యం వేగిపోయే మనస్తత్వం. ఆ ఊళ్లో కేబుల్ నడిపిస్తూ భార్య జ్యోతి (మీనా), కుమార్తెలు అంజు (కృతిక), అను (బేబీ ఎస్తేర్)లను పోషించుకొంటూంటాడు. అతడికి భార్య కంటే కూడా సినిమాలంటే బోలెడంత ఇష్టం. ఎంత అంటే? సినిమా తర్వాతనే అతడి కుటుంబం. రాంబాబుకి అవినీతి అంటే పడదు. ఆ ఊరి కానిస్టేబుల్ వీరభద్రం (రవి కాలే)కి అదే ప్రవృత్తి. వీరభద్రం చేసే అవినీతి కార్యక్రమాల్ని చూళ్లేక ఎదురు తిరుగుతాడు రాంబాబు. అతడిపై పగ తీర్చుకోవటానికి సమయం కోసం ఎదురుచూస్తూంటాడు వీరభద్రం. ఐజి గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు వరుణ్ తప్పిపోతాడు. ఆ కేసులో రాంబాబుని ఇరికిస్తాడు వీరభద్రం. ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
కథని నమ్మితే- చెడు చేయదన్నది ఎన్నాళ్లుగానో వస్తున్న సినీ నీతిసూత్రం. ‘రీమేక్’ అన్నామా? ఆ కథని ఏదో విధంగా చిత్రిక పట్టేసి... కొసమెరుపులన్నీ తీసేసి... తెలుగు నేటివిటీకి తగ్గట్టు అని - కామెడీ ట్రాక్‌లనీ... ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లనూ గుది గుచ్చేయటం పరిపాటి. దాంతో ‘కాళిదాసు కవిత్వం కొంత... నా పైత్యం కొంత’ అన్నట్టుగా కథ తయారవుతుంది. కానీ - ఇక్కడ ఆ ‘్ఫల్’ని ఏ మాత్రం చెడగొట్టకుండా - కథలో ఎటువంటి మార్పులు చేయకుండా - ఉన్నది ఉన్నట్టుగా సన్నివేశానికి సన్నివేశం తీయటంతో - ఇన్నాళ్లకి ఒక మంచి సినిమా చూశాం అన్న సంతృప్తి కనిపించింది ప్రేక్షకుల కళ్లల్లో. అంత మాత్రాన ఇదేదో బ్రహ్మాండం అని చెప్పటం కాదుగానీ... థ్రిల్లర్‌ని కుటుంబ నేపథ్యంలో చూపటంతో - ప్రేక్షకుడు కూడా ఆ ‘ఎత్తుగడల’ను తానే వేస్తూన్నట్టు భావిస్తాడు.
ఏ కథైనా మలుపు వరకూ వెళ్లాలంటే- కేరెక్టర్‌ని విశే్లషించటం జరగాలి. లేదూ నేపథ్యాన్ని బేస్ చేసుకొంటూ వెళ్లాలి. ఈ కథలో రాంబాబుని గురించి చెప్పటం... ఊళ్లో గొడవలు... కానిస్టేబుల్ వీరభద్రం సంగతులతో ఫస్ట్ హాఫ్ చాలా వరకూ సాగింది. ఇంతకీ దర్శకురాలు శ్రీప్రియ ఏం చెప్పదలచుకున్నదీ? అన్న సందేహం రాక మానదు. కథ మలుపులోకి రావటం ఆలస్యం - మితిమీరిన వేగంతో పయనించింది. ఆ టెంపోని అలాగే మెయిన్‌టెయిన్ చేస్తూ క్లైమాక్స్ వరకూ వచ్చింది. కథలో ప్రేక్షకుడు ఎప్పుడైతే ఇన్‌వాల్వ్ అవుతాడో ఇక కథకి వచ్చిన ఢోకా ఏం లేదు. అదే వెళ్లిపోతుంది - ప్రేక్షకుణ్ణి తీసుకొని. ఈ కథ నాదే. నేనే వీరభద్రాన్ని ఎదుర్కోవాలి. ఎలా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి? అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యేట్టు ప్రేక్షకుణ్ణి చేసి.. ఇది అతడి కథే అన్నట్టు చేయటంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి దర్శకురాలికి.
హీరో అంటే ఫైట్స్ చేయాలి. డ్యూయెట్లు పాడాలి. నాలుగు కుళ్లు జోకులతో అభిమానుల్ని అలరించాలి. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లతో చప్పట్లు కొట్టేట్టు చేయాలి అన్న నియమం నుంచీ - ఎప్పుడైతే తెలుగు హీరో బయటపడతాడో అప్పుడే సినీ కథ బాగు పడుతుంది అన్న మాటకి ఈ సినిమా సరికొత్త ప్రక్రియకు తెర తీసింది. రాంబాబు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. అలాగే ఉంటాడు. అలాగే ప్రవర్తిస్తాడు కూడా. తెలుగు హీరో అలా ప్రవర్తించవచ్చా? కలల్లో బతికేయాలి. హీరోయిజం అంటే విలన్‌ని నాలుగు దెబ్బలు కొట్టాలి.. లాంటి భేషజాలకు వెళ్లలేదు. అందుకే- ఈ కథ అనుభూతిని మిగిల్చింది.
వెంకటేష్ ఈ కథని ఒప్పుకోవటమే ఒక సాహసం. అందునా - ఎదిగిన ఇద్దరు పిల్లల తండ్రిగా. హీరోయిజం ప్రదర్శించటానికేం లేదు. మామూలుగా మధ్యతరగతి తండ్రి కుటుంబంతో ఎలా ఉంటాడో అలాగే ఉండాలి. అంటే - హీరోకి చేతులు కట్టేసినట్టే. వెంకటేష్ ఇలా అనుకోలేదు. కథ ఏం చెప్పిందో అదే చేశాడు. అందుకే ‘దృశ్యం’లో ఎక్కడా వేలు పెట్టటానికి లేదు. మీనా నటనలో మరింత పరిణతి కనిపించింది. హీరోతో స్టెప్పులేసే.. ఆర్భాటాలేవీ పెట్టుకోకుండా - సాదాసీదా గృహిణిగా ఎంతో హుందాతనంతో కనిపించింది. పిల్లల పాత్రల్లో కృతిక, ఎస్తేర్ చక్కగా నటించారు. నదియా పాత్రలో ఏదో వెలితి కనిపించింది. పాత్ర పరిధి తక్కువ కాబట్టి... అలా ఉందేమో?! కానిస్టేబుల్ వీరభద్రంగా రవి కాలే చక్కటి నటన ప్రదర్శించాడు. విలన్ అంటే ఇతడే అన్నట్టుగా - నెగెటివ్ షేడ్స్ చూపాడు. వెంకటేశ్ అసిస్టెంట్‌గా సప్తగిరి... పరుచూరి వెంకటేశ్వరరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్.. ఇలా ఎవరికి వారే - కథని అద్భుతంగా పండించారు.
శరత్ సంగీతం... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ‘డార్లింగ్’ స్వామి డైలాగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. మామూలుగా మాట్లాడుకొనే మాటల్లానే ఉన్నా... ఎద లోతుల్లో అలజడిని సృష్టించాయి.
మలయాళ ‘దృశ్యం’ కథకి మూలం - ‘సస్పెక్ట్ ఎక్స్’ అనే జపనీస్ సినిమా అంటూ వార్తలొచ్చినా... ఏ కథనైనా తీసుకొంటే- దాన్ని ఎంతవరకూ సక్సెస్ చేయగలమన్న నమ్మకం ప్రధానం. అదే ఇక్కడ జరిగింది.
కామెడీ ట్రాక్ లుండాలి. రొమాన్స్ సీన్లు ఉండాలి. టూ-పీస్ సన్నివేశాలుండాలి అని ఎవరూ అడగరు. అలా ఉంటేనే చూస్తారన్నదీ లేదు. ఈ సినిమా అలాంటిదే. ఫ్యామిలీ డ్రామాకి కాస్తంత థ్రిల్లర్‌ని కలిపి - ‘దృశ్యం’ని ఎలా మలచారో తెలుస్తుంది.

No comments:

Post a Comment