Friday, July 18, 2014

సమాంతర సమాహారం!
18/07/2014-ఎం.డి.అబ్దుల్

============ ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎన్నుకున్నప్పటినుండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇదొక అరుదైన అవకాశం. ముఖ్యంగా దర్శకులు, ఫిలిమ్ మేకర్స్ ఈ చిత్రాలను చూసి, సినిమా నిర్మాణ విలువలను తెలుసుకున్నారు.
-శైలజా సుమన్ , డిప్యూటీ డైరెక్టర్ జనరల్

============ఈ ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించడం తెలుగువాడిగా నేను గర్విస్తున్నాను. ఈ ఉత్సవాలు నిర్వహించిన దూరదర్శన్‌ని అభినందిస్తున్నాను. ఈ ఉత్సవాల వల్ల ఇతర భాషా చిత్రాలను చూసి అక్కడి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవచ్చు.
-డా.డి.రామానాయుడు
============ఈ ఉత్సవాలకు అద్భుతమైన ఆదరణ లభించింది. మంచి సినిమాలను చూడడానికి అనేక మంది సినీ ప్రేమికులు విచ్చేశారు. అందరి సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం. -
అనితాసిన్హా అడిషనల్ డైరెక్టర్ జనరల్
============తెలుగు నిర్మాతలు ఇలాంటి చిత్రాలను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ స్థాయలో పోటీపడే చిత్రాలను నిర్మిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ ఇతర భాషా చిత్రాలను చూసి ఎంతో ముచ్చటపడ్డారు.
-షరీష్
దృశ్యమాథ్యమం ప్రధానంగా మానవ జీవితంలోని అన్ని కోణాలను స్పృశిస్తుంది. ఇందుకు ప్రధాన వేదిక సినిమా. భారతదేశంలో అనేక భాషల్లో ఉద్ధండులైన దర్శకులు సినిమాలను రూపొందిస్తున్నారు. కమర్షియల్ పంథాను అనుసరించకుండా కేవలం మానవ జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరిస్తూ తీసిన సమాంతర చిత్రాలకు వాణిజ్య విలువలు లేకపోయినా ఉత్తమాభిరుచిగల ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ఇది గమనించిన హైదరాబాద్ దూరదర్శన్ ‘బెస్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా’ పేరిట ఫిలిం ఫెస్టివల్ నిర్వహించింది. ఈనెల 12, 13 తేదీలలో భారతదేశంలోని రెండవసారి దూరదర్శన్ నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్‌కు వేదికగా హైదరాబాద్ మారింది. తొలిసారిగా ఢిల్లీలో నిర్వహించిన ఈ ఉత్సవం, హైదరాబాద్‌లో నిర్వహించడం నగర సినీ ప్రియులకు ఆనందాన్నిచ్చింది. వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకలను దాదాసాహెబ్ అవార్డు గ్రహీత డా. డి.రామానాయుడు ప్రారంభించారు. ఉత్సవంలో తొలి చిత్రంగా రాజేంద్రప్రసాద్ నటించగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సి.సి.రెడ్డి తెలుగులో రూపొందించిన ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని ప్రదర్శించారు. మనిషి జీవితంలో చీకటికోణం ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం. అటువంటి ఆలోచన రావడం చాలా పెద్ద నేరం, తప్పు అంటూ ఈ చిత్రంలో కథానాయకుడు వాదిస్తాడు. అలా ఆత్మహత్య ముంగిట్లోకి వెళుతున్న అనేకమందిని చేరదీసి వారందరినీ ఒకేసారిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరణం సమీపానికి తీసుకెళతానని మాట ఇస్తాడు. అలా చెబుతూ జీవితంపై ఆశ కలిగేలా వారిలో మార్పు రావడం కోసం ప్రయత్నిస్తాడు. చివరికి ఆయన అనుకున్న మార్పు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవారిలో వచ్చిందా, లేదా? అన్న కథనంతో ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సమావేశంలో దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి ఈ చిత్రం నిర్మించడానికి గల కారణాలను, చిత్రీకరణ సమయంలో అనుభవాలను వివరించారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వంలో బెంగాలీ భాషలో రూపొందించిన ‘హెర్బెట్’ అనే 142 నిమిషాల చిత్రాన్ని ఆ తరువాత ప్రదర్శించారు. 1997లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నబరూన్ భట్టాచార్య అందించిన కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. అతీంద్రియ శక్తులు అనేవి మనుషులమధ్య ఉన్నాయా లేవా? అన్న సమస్యను ఈ చిత్రం చూపుతుంది. మరణించినవారితో మాట్లాడడం సంభవమేనా? అలా మాట్లాడితే ఏ ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు? అలా మరణించినవారితో మాట్లాడే కథానాయకుడి పాత్రతో ఈ చిత్రం సాగుతుంది. చివరికి అతను మరణించాక ఎవరితో మాట్లాడాడు అన్న కథనంతో ఈ చిత్రం సరికొత్త స్క్రీన్‌ప్లేతో సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివాజీ చంద్రభూణ్ దర్శకత్వం వహించిన మరో హిందీ చిత్రం ‘వన్‌మోర్’. 94 నిమిషాల ఈ హిందీ చిత్రం లడఖ్‌లో జరిగే ఓ కథతో సాగింది. మారుమూల ప్రాంతంలోవున్న కొండలపై జరిగే ఐస్‌హాకీ అనే ఆటతో ముడిపడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రష్యాలో క్రీడాకారులు ఆడే ఈ ఆట భారతదేశంలో కూడా ఆడాలని రచయిత కోరిక. అదికూడా గిరిజన ప్రాంతాలలో ఎత్తయన కొండలలో ఉండే క్రీడామైదానాల్లో ఈ ఆట ఆడాలని, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా, రాజకీయ సరిహద్దులను చెరిపేసేలా ఈ ఆట ఓ ఫ్యాషన్‌లా మారాలని కథానాయకుడు భావిస్తాడు. ప్రస్తుతం క్రికెట్ దేశంలో ఎంత ఆదరణ పొందిందో, అంత ఆదరణ పొందాలనుకుంటాడు. దేశంలో ఎత్తయన కొండలు ఇటువంటి క్రీడలు ఆడడానికి అనువుగా వుండాలన్న కోరికతో ఈ చిత్రం సాగింది. శివాజీ చంద్రభూషణ్ ఈ కథను సరికొత్త విధానంతో ప్రకృతిని మనం ఎంతగా ఆరాధించాలో చెబుతూ మమేకం చేస్తాడు. పరేష్ కామ్‌దార్ హిందీలో రూపొందించిన 94 నిమిషాల ‘ఖర్గోష్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఖర్గోష్ అంటే ఓ అందమైన కుందేలు అని అర్థం. అటువంటి ఛాయలున్న బంటూ అనే బాలుడు కథా కథనం ఈ చిత్రం. ప్రియంవాడ్ రచించిన ఈ కథతో పరేష్ కామ్‌దార్ ఓ మంచి చిత్రాన్ని రూపొందించాడు. చుట్టూ వున్న వాతావరణంతో బంటూ ఎలా ఒదిగిపోయాడు, కొత్త కొత్త విషయాలు ఎలా నేర్చుకున్నాడు, అతని చుట్టూ జరుగుతున్న మార్పులు ముఖ్యంగా తన స్నేహితులైన అబ్బాయిలు, అమ్మాయిల వ్యక్తిగత మార్పులు ఎలా వున్నాయి, తాను ఎలా మారాలి అన్న కథనంతో ఈ చిత్రం సాగింది. చిన్నపిల్లల ఆలోచనా దృక్పథంతోసాగే ఈ చిత్రం ప్రదర్శన అనంతరం దర్శకుడు పరేష్ కామ్‌దార్ సినిమా మేకింగ్‌కు సంబంధించిన అనేక వెళకువలు తన ప్రసంగం ద్వారా వినిపిస్తూనే ఎడిటింగ్ ప్రాముఖ్యతను తెలిపారు. అంతేకాదు, ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తమిళంలో అంశాన్‌కమార్ రూపొందించిన ‘ఒరుత్తి’ చిత్రం సావని అనే ఓ అమ్మాయి కథనంతో సాగింది. 91 నిమిషాల ఈ చిత్రకథను కె.రాజ్‌నారాయణ్ రచించారు. తమిళనాడులోని పీఠభూముల్లో అలంపట్టి అనే ఊరిలో జరిగిన ఈ కథలో సావని పత్తి పండించే ప్రాంతాల్లో పొలం పనులు చేస్తుంది. స్థానిక జమీందారు పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి జమ చేయడు. ఈ విషయంలో గ్రామస్థులలో భేదాభిప్రాయాలు పొడసూపుతాయి. చిన్న వయస్సు ఉన్నా సావని జమీందారిలో మార్పు రావడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. దీంతో జరిగిన ఓ సంఘటనతో గొప్పింటి అబ్బాయి ఎలప్పన్‌తో సావనికి వివాహం చేయాలని గ్రామస్థులు అనుకుంటారు. గ్రామస్థులు జమీందారు భయానికి జడిసి ఇలా చేస్తున్నారని గ్రహించిన సావని, చిన్న కులాలలో ఇటువంటి ఇబ్బందులు తప్పవని భావించి, తన కులస్థులలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అమ్మాయి అద్భుతమైన ప్రతిభతో ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా నటించింది. ఆ తరువాత మణిపురి భాషలో డా. ముఖోమణి మోగాసాబా రూపొందించిన ‘ఎన్నింగ్ అమాడి లిక్లా’ చిత్రాన్ని ప్రదర్శించారు. 135 నిమిషాల నిడివిగల ఈ చిత్రంలో సానాటోబా అనే పదేళ్ల కుర్రాడు కథానాయకుడు. తాగుబోతు తండ్రి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధతో ఉన్నా, రైస్‌మిల్లులో పనిచేసే అమ్మ సహకారంతో చదువుకోవడానికి బడికి వెళుతుంటాడు. అక్కడ పక్కింటి అమ్మాయి క్లాస్‌లో స్నేహితురాలుగా మారుతుంది. ఇంటికి వచ్చాక మాత్రం ఆమె ఎవరో అతనికి తెలియనట్లే ఉంటాడు. తండ్రిని తాగుబోతుగా చూడడం ఇష్టంలేక అతనిలో మార్పుకోసం ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు సహకారం ఎలా పొందాడు అన్న కథనంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గాలిపటాల పాటలో సంగీత దర్శకుడు చూపిన ప్రతిభ అందరికీ నచ్చింది. ఇలాంటి అద్భుత కథనాలతో వున్న ఆరు చిత్రాలను హైదరాబాద్ దూరదర్శన్ ప్రేక్షకులకు దగ్గరచేసింది. ఈ చిత్రాలన్నీ గమనిస్తే కొట్టొచ్చేట్టు కన్పించేది ఏమంటే ఆరుగురు దర్శకులు వివిధ భాషల్లో బాలల నేపథ్యంలో రూపొందినవే. బాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ చిత్రాలు చూపాయి. అదేవిధంగా పెద్దలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ‘మీ శ్రేయోభిలాషి’లో చర్చించారు. అదీంద్రియ శక్తుల నేపథ్యంలో ఒకటి, మారుమూల క్రీడా ప్రాధాన్యత గూర్చి మరొకటి కూడా ఫిల్మోత్సవంలో భాగం అయ్యాయి. హైదరాబాద్ దూరదర్శన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనితా సిన్హా, డి.డి.జి. ఎం.శైలజా సుమన్, ఎ.డి.పి.బెల్లి ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలో ప్రధానపాత్ర నిర్వహించారు. సినిమా ఎక్కడైనా సరే ప్రేక్షకులకు ఓ పాఠంగా, వారి జీవితాల్లో మార్పులు సూచించేదిగా ఉండాలన్న ఓ మాటను ఈ చలనచిత్రోత్సవాలు నిజం చేశాయి. ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరిగి ఉత్తమ చిత్రాలను ప్రేక్షకులను అందించాలని కోరుకుందాం.

No comments:

Post a Comment